జన చైతన్య యాత్రకు జేజేలు

– ప్రత్యేక ఆకర్షణగా బైక్‌ ర్యాలీ
– పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, సీపీఐ నేతల సంఘీభావం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రారంభమైన జన చైతన్య యాత్ర శనివారం రెండో రోజు ముగిసింది. శుక్రవారం వరంగల్‌ లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనంతరం హన్మకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో యాత్ర కొనసాగింది. ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ యాత్రకు జనం జేజేలు పలుకుతున్నారు. యాత్ర ముందు భాగంలో ప్రచార రథం, వందలాది మందితో ఉన్న బైక్‌ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తున్నది. రెండు రోజుల నుంచి ప్రజలు ఉత్సాహ పూరిత వాతావరణంలో పాల్గొంటున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదం, కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా ఇది సాగుతున్నది. రాజ్యాంగ రక్షణ ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. బీజేపీ విధానాలతో దేశానికి, రాజ్యాంగానికి, లౌకిక ప్రజాస్వామ్యానికి వస్తున్న ప్రమాదం గురించి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జన చైతన్య యాత్ర బంద నాయకులు పోతినేని సుదర్శన్‌ తోపాటు ఇతర నాయకులు చేస్తున్న ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ యాత్రకు మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితోపాటు సీపీఐ, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహన్ని నింపుతున్నది. ఈ నెల 29 వరకు ఈ యాత్ర కొనసాగనున్నది.

Spread the love