జేఎల్‌ ఇంగ్లీష్‌ పరీక్షకు వ్యాలిడిటీ లేదు

JL English test has no validity– ప్రకటించిన సిలబస్‌ ఒకటి.. వచ్చిన ప్రశ్నలు మరొకటి
– ప్రశ్నాపత్రాన్ని పున:పరీక్షించాలి
– సీనియర్‌ ఆంగ్ల ప్రొఫెసర్‌తో కమిటీ వేయాలి :ఓయూ జేఏసీ అధ్యక్షుడు డా.ఎల్చల దత్తాత్రేయ డిమాండ్‌
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జేఎల్‌ పరీక్షల్లో తొలి పరీక్షగా మంగళవారం జరిగిన జేఎల్‌ ఆంగ్ల ప్రశ్నాపత్రానికి వ్యాలిడిటీ లేదని నిరుద్యోగ ఓయూ జేఏసీ అధ్యక్షుడు డా.ఎల్చల దత్తాత్రేయ అన్నారు. బుధవారం ఓయూలో నిరుద్యోగ జేఎల్‌ ఆంగ్ల అభ్యర్థులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సిలబస్‌ ప్రకారం జేఎల్‌ ఆంగ్ల ప్రశ్నాపత్రాన్ని తయారు చేయలేదని, సిలబస్‌లో లేని అంశాలే 70 శాతం వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం టీఎస్‌పీఎస్సీ అధికారులు ఈ ప్రశ్నాపత్రాన్ని సమీక్షించి, అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నాపత్రాన్ని పున:సమీక్షించి సిలబస్‌లో లేని ప్రశ్నలను తొలగించాలని, సీనియర్‌ ప్రొఫెసర్‌తో కమిటీ వేసి జేఎల్‌ ఆంగ్ల ప్రశ్నాపత్ర వ్యాలిడిటీని తేల్చాలన్నారు. కటాఫ్‌ మార్క్‌లను తగ్గించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో వచ్చిన జేఎల్‌ నోటిఫికేషన్‌ చివరిదని, 16 సంవత్సరాల తరువాత వచ్చిన ఈ నోటిఫికేషన్‌లో ప్రకటించిన సిలబస్‌ ప్రకారం ప్రశ్నాపత్రం ఇవ్వకపోవడం నిరుద్యోగులకు నిరాశను మిగిల్చిందన్నారు. ఇప్పటికైనా టీఎస్‌పీఎస్సీ అధికారులు మేల్కొని ఈ ప్రశ్నాపత్రంపై సమీక్ష నిర్వహించి సిలబస్‌లో లేని ప్రశ్నలకు తొలగించి, వ్యాలిడిటీని సీనియర్‌ ఆంగ్ల ప్రొఫెసర్‌తో నిర్ధారించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జేఎల్‌ ఆంగ్ల అభ్యర్థులు ప్రణీత్‌, అంజి యాదవ్‌, రాజేష్‌, నరేందర్‌, షబ్బీర్‌, నరేష్‌, చిరంజీవి, నాగరాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love