నవతెలంగాణ – హైదరాబాద్
హైదారాబాద్ కేంద్రంగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని గురుమూర్తి సెంటర్‌లో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. ఆయనకు నివాళులర్పించారు. శాసన మండలి సభ్యులు కోదండరాం, ప్రముఖ సంఘ సేవకురాలు, బాలల హక్కుల ఉద్యమ నాయకులు శాంతా సిన్హా, ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మదన్, కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డు ప్రొఫెసర్ శ్యామల కుమారి, సీనియర్ జర్నలిస్టు నెల్లూరి నరసింహారావు, వెంకట శ్రీనివాస రెడ్డి, ఆకిన వెంకటేశ్వర్లు, హిందూ గ్రూప్ పూర్వపు విలేఖరి సోమశేఖర ఇంకా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో చదువుతున్న రోజుల్లో ఏచూరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భిన్న స్రవంతులకి చేయందించిన వారిని ఓకే లక్ష్యం కోసం ఓకే గూటికి తీసుకురావడంలో జేఎన్‌యూ నే ఆయనకి తొలి ప్రయోగశాల అని వక్తలు వెల్లడించారు. అటువంటి ప్రయోగంతోనే ఏచూరి విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యారని గుర్తు చేసుకున్నారు. నేడున్న భారత పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వాల నిర్మాణంలో దిట్ట అయిన ఏచూరి సేవలు అందుబాటులో లేకపోవడం విచారకరం అని వక్తలు అభిప్రాయ పడ్డారు. మాజీ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, హుడా, అజరు మిశ్రా, రాజన్ హర్షే, గీత ఆర్షే తదితరులు పాల్గొన్నారు.