వైద్యారోగ్యశాఖలో జీవో 142 రద్దు చేయాలి

– 5న చలో డైరెక్టరేట్‌
– రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖలో జీవో 142ను రద్దు చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన డాక్టర్లు, పారామెడికల్‌ ఉద్యోగుల యూనియన్స్‌, అసోసియేషన్స్‌ల రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి కె.యాదానాయక్‌ (సీఐటీయూ) అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ల యూనియన్‌ నుండి డాక్టర్‌ బి రమేష్‌, డాక్టర్‌ లాలు ప్రసాద్‌ (డాక్టర్స్‌ యూనియన్‌), కె.సాయి రెడ్డి, రాజశేఖర్‌, రాబర్ట్‌ బ్రూస్‌ (టిఆర్‌ఎస్కేవి), కె.యాదానాయక్‌, బలరాం (సీఐటీయూ) శ్యాంసుందర్‌, వెంకటేశ్వర రెడ్డి (ఐఎన్‌ టీయూసీ), భరత్‌ సత్యనారాయణ, చంద్ర ప్రకాష్‌ ( సీహెచ్‌ఓల అసోసియేషన్‌ ), కొప్పు ప్రసాద్‌ (హెల్త్‌ ఎక్సటెన్షన్‌ మీడియా ఆఫీసర్స్‌ అసోసియేషన్‌), రామేశ్వరి (ఏఎన్‌ఎం,హెచ్‌వి,పిహెచ్‌ఎన్‌ అసోసి యేషన్‌), రామలక్ష్మి (ఎస్సీ.ఎస్టీ అసోసియేషన్‌), వీరారెడ్డి ( ఫార్మసిస్టుల అసోసియేషన్‌), శ్రీనివాస్‌ (బీసీ ఉద్యోగుల అసోసియేషన్‌), తిరుపతి (ఎస్టీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌) పాల్గొన్నారు. జీవో 142ను రద్దు చేయాలనీ, అక్టోబర్‌ 5న (నేడు) ఉదయం 10 గంటలకు ఛలో డైరెక్టరేట్‌ నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఛలో డైరెక్టరేట్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో డాక్టర్‌ వసంత్‌, డాక్టర్‌ అన్నపూర్ణ, అశోక్‌, ప్రకాష్‌, గుండయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావులను కలిసి ప్రయత్నించినట్టు తెలిపారు. అయితే అధికార యంత్రాంగం నుంచి సరైన సమాధానం లభించకపోవడం, నిర్లక్ష్య వైఖరి ఉద్యోగ సంఘాల నాయకులను అనివార్యంగా ఐక్య ఉద్యమాల వైపుకు నడిపించిందని తెలిపారు. వైద్యారోగ్యశాఖలో కార్మిక సంఘాలు, క్యాడర్‌ సంఘాలు జీవో 142 రద్దు పోరాట కమిటీగా ఏర్పడి సమ్మె నోటీస్‌ ఇచ్చాయని వారు గుర్తుచేశారు.
దేశంలోనే అత్యంత మలేరియా ప్రభావిత ప్రాంతాలైన భద్రాచలం, ములుగు, ఆసిఫాబాద్‌ వంటి ఏజెన్సీ జిల్లాలకు జిల్లా మలేరియా అధికారి, మలేరియా సబ్‌ యూనిట్‌ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్లలో పర్యవేక్షించే 63 డిప్యూటీ డీఎంహెచ్‌ఓలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలలో జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్లను తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్‌ సీల్లో నాలుగవ తరగతి ఉద్యోగుల పోస్టులు తీసేసిన వారికే ఊడ్చేది, తూడ్చేది ఎవరనేది తెలియాలని ఎద్దేవా చేశారు. 24 గంటలు నడిచే పీహెచ్‌సీల్లో నైట్‌ వాచ్‌మెన్‌తో పాటు అనేక రకాల పోస్టులను తీసేశారని తెలిపారు. 1,217 పోస్టులను సూపర్‌ న్యూమరరీగా చూపిస్తూ రద్దు చేస్తే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ఏ విధంగా బలోపేతమవుతుందని ప్రశ్నించారు.

తప్పుదోవ పట్టిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఆరోగ్యానికి పెడుతున్న ఖర్చుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని వారు విమర్శించారు. నీటి సరఫరా, పారిశుధ్యం, పౌష్టికాహారం కూడా ఆరోగ్య పద్దులో కలిపేస్తున్నదని వివరించారు. రాష్ట్రంలో అత్యధిక మందికి నేటికి నాణ్యమైన విద్య అందుబాటులో లేదని చెప్పారు. గర్భిణులను డోలీ కట్టి మోసుకుపోవడం ఇప్పటికీ అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నదని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు సరైన శిక్షణ లేని వారి వద్ద అనధికార వైద్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా లేని కారణంగా నగరాల్లోని పెద్దాస్పత్రులు, బోధనా స్పత్రుల వద్ద మితిమీరిన రద్దు రోజుకు 4 నుంచి 6 వేల వరకుంటున్నదన్నారు. సాలీన తెలుగు రాష్ట్రాల్లో 46 లక్షల కుటుంబాలు వైద్య ఖర్చుల కారణంగా మధ్య తరగతి నుంచి పేదరికంలోకి జారిపోతున్నాయని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 3 వేల జనాభాకు, మైదాన ప్రాంతాల్లో 5 వేల జనాభాకు ఒక సబ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి అందులో ఎంపీహెచ్‌ డబ్ల్యూ (ఎఫ్‌), ఎంపీహెచ్‌ డబ్ల్యూ (ఎం) పోస్టులు ఉండేలా చూడాలని ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ కమిటీ చెబు తున్నదని గుర్తుచేశారు. అయితే ఆ ప్రమాణాలకు భిన్నంగా జీవో 142లో 26 పీపీ యూనిట్లలో ఉన్న ఏఎన్‌ఎం పోస్టులను తీసేశారని విమర్శిం చారు. కొత్త సబ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తే 20 ఏండ్ల నుంచి పని చేస్తున్న ఏఎన్‌ఎం, సెకెండ్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయవచ్చని సూచిం చారు. రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలు, 40 మండ లాలు, జోన్లు, గ్రామ పంచాయితీలను పెంచిన సర్కారు జనాభా ప్రాతిపదికన ఏఎన్‌ఎం సబ్‌ సెంటర్లను ఎందుకు పెంచలేదని? వారు ప్రశ్నించారు.

Spread the love