– కమిషన్‌పై నమ్మకంతో పరీక్షలు రాయండి
– బాధ్యతల స్వీకరణ సందర్భంగా టీజీపీఎస్సీ చైర్మెన్ బుర్రా వెంకటేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు భర్తీ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా చేపడతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) చైర్మెన్ బుర్రా వెంకటేశం అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో చైర్మెన్‌గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీజీపీఎస్సీలో వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసంటూ, ఉద్యోగం ఇప్పిస్తామంటే ఎవరిని నమ్మకుండా వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని నిరుద్యోగులకు సూచించారు. అలాంటి పైరవీకారులెవరైనా కమిషన్ కార్యాలయంలో ఉంటే వెంటనే తప్పుకోవాలని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం త్వరలో టోల్‌ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ”ఐఏఎస్ నా కల. నేను ఉద్యోగానికి సన్నద్దం అయ్యే సమయంలో నాపై నమ్మకంతో చదివి ఉద్యోగం సాధించానే తప్ప ఎవరినీ నమ్మలేదు. కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్‌లో 15వ ర్యాంక్ సాధించాను. కమిషన్‌పై మరింత నమ్మకం కలిగేలా యూపీఎస్సీ తరహాలో పనిచేస్తాం. నిరుద్యోగ అభ్యర్థుల కోసం మూడున్నరేండ్ల సర్వీస్‌ని వదులుకుని టీజీపీఎస్సీ బాధ్యతలు స్వీకరించారు. అభ్యర్థులు కష్టపడి పరీక్షలు రాస్తే విజయం సాధిస్తారు” అని నిరుద్యోగులకు ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు.