రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా జో బిడెన్ రానట్టే..!

నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే నెల జనవరిలో జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ఆరంభంలో ప్రెసిడెంట్ బిడెన్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగం చేయాల్సి ఉండడం, మరోవైపు ఎన్నికల ప్రచారం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా ప్రత్యేక దృష్టిసారించిన నేపథ్యంలో భారత్‌కు ప్రయాణించకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు భారత్‌కు సమాచారం అందిందని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జనవరి 26, 2024న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుడు బిడెన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి సెప్టెంబర్ నెలలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలకు బిడెన్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్టు భారత్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదిలావుంచితే.. జనవరిలో జరగాల్సిన క్వాడ్ సదస్సును డిసెంబర్ చివరిలోనే ఏర్పాటు చేయాలని ఆతిథ్య భారత్ నిర్ణయించింది. 2024లో నిర్వహణకు ప్రతిపాదించినప్పటికీ ప్రతిపాదిత తేదీల్లో అన్ని భాగస్వామ్య దేశాలు పాల్గొనే అవకాశం లేకపోవడంతో సవరించాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా క్వాడ్ అనేది అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన కూటమి. ఉమ్మడి ప్రయోజనాల రక్షణకు ఇది ఏర్పాటైంది.

Spread the love