గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని స్థానిక టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మండల పరిధిలోని మర్కోడు గ్రామం బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో టీపీటీఎఫ్ మండల ఉపాధ్యక్షుడు వై. నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోగ రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటి పిలుపులో భాగంగా జూలై, 6వ తేదీన హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన జరుగుతుందన్నారు. సుమారు పన్నెండు సంవత్సరాలుగా పదోన్నతులు, ఆరు సంవత్సరాలుగా బదిలీలు, పన్నెండు సంవత్సరాలుగా ప్రత్యక్ష నియామకాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 2013-14 విద్యా సంవత్సరంలో కన్వర్ట్ చేయబడిన ఆశ్రమ పాఠశాలలకు నేటికీ పోస్టులు మంజూరి చేయబడలేదని చెప్పారు. 15 సంవత్సరాలుగా సి.ఆర్.టీలు శ్రమ దోపిడికి గురవుతున్నారని, వీరిని రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయడం లేదని వాపోయారు. ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ తరువాత ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ రెండవ పెద్ద సెక్టార్ గా ఉందని గుర్తు చేశారు. సంక్షేమ రంగంగా పాలకులు చెప్పుకుంటున్న గిరిజన సంక్షేమ శాఖ పట్ల సవతి ప్రేమను ప్రదర్శించడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆందోళన ఉద్యమాలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. మండలం నుండి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో కదిలి హైదరాబాద్ లో జరిగే నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీచర్లు కొమరం రాంబాబు, జి.జోగయ్య, కల్తి వసంతరావు, వేల్పు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.