మహిళలు, బాలల రక్షణపై సంయుక్త కార్యాచరణ

– మహిళా భద్రతా విభాగం, బీబీఏల మధ్య ఒప్పందం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో మహిళలు, బాలలపై లైంగికదాడులు జరగకుండా చూసేందుకు పకడ్బంధీగా సంయుక్త కార్యచరణను రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం, బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌(బీబీఏ) సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు ఈ రెండు విభాగాల మధ్య డీజీపీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పందం కుదిరినట్టు అదనపు డీజీ షికా గోయెల్‌ తెలిపారు. ముఖ్యంగా, మహిళలు, బాలికలు మానవ అక్రమ రవాణా చేసేవారి బారిన పడకుండా చూడటంలోనూ, లైంగిక వేధింపులకు గురి కాకుండా చూడటానికి బీబీఏ సంస్థతో కలిసి నిర్ణయిస్తున్న సంయుక్త కార్యచరణ మంచి ఫలితాలనిస్తున్నాయని ఆమె అన్నారు. లైంగికదాడులకు గురవుతున్న మహిళలు, బాలికలను రక్షించటం, వారికి న్యాయస్థానం నుంచి తగిన న్యాయం జరిగేలా చూడటానికి అవసరమైన సహాయాన్ని అందించటం, బాధిత మహిళలకు అవసరమైన ఉద్యోగాలను కల్పించటం, ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సాయం వారికి లభించేలా చూడటం వంటి కార్యకలాపాలను ఈ రెండు విభాగాలు సంయుక్తంగా చేపడుతున్నాయని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దాదాపు 800 మంది బాలికలు, మహిళలను రక్షించటం, వారిలో కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించటం, వారిలో కొందరికి జరిగిన అన్యాయానికి కోర్టుల నుంచి న్యాయాన్ని సాధించటం, దాదాపు రూ.28 లక్షలకు పైగా ఆర్థిక సాయాన్ని అందించటం జరిగిందని షికా గోయెల్‌ తెలిపారు.

Spread the love