జర్నలిస్ట్‌ సూర్యప్రకాశ్‌ వైద్య ఖర్చులకు

– మంత్రి దామోదర రూ.లక్ష సాయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఢిల్లీలోని మ్యాక్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సీనియర్‌ జర్నలిస్ట్‌ కేవీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రకాశ్‌కు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అండగా నిలిచారు. ప్రకాశ్‌ చికిత్స కోసం రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మంత్రి సూచన మేరకు ఈ మొత్తాన్ని ప్రకాశ్‌ బ్యాంక్‌ అకౌంట్‌కు పంపిస్తున్నామని ఆయన కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ఢిల్లీలో సాక్షి పత్రిక జర్నలిస్టుగా పని చేస్తున్న ప్రకాశ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో, 4 రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, హైదరాబాద్‌లో పని చేస్తున్న పలువురు జర్నలిస్టులు మంత్రి దామోదర దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఢిల్లీలో పని చేస్తున్న పలువురు రిపోర్టర్లతో మంగళవారం మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ప్రసాద్‌ త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆయన చికిత్స కోసం తాను వ్యక్తిగతంగా రూ.లక్ష సాయం చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ అండగా ఉంటుందనీ, సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇండ్ల స్థలాలను సమస్యను కూడా ఇటీవలే పరిష్కరించామని మంత్రి గుర్తు చేశారు. జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీమ్‌ కింద జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

Spread the love