నవతెలంగాణ ఢిల్లీ: వీహెచ్‌పీ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ త్వరలో సుప్రీంకోర్టు కొలీజియం ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు సమగ్ర నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) నేతృత్వంలో కొలీజియం ముందు జడ్జి జస్టిస్ యాదవ్ హాజరై తన వివరణ తెలిపే అవకాశం ఉంటుందని న్యాయస్థాన వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నెల 8న వీహెచ్‌పీ కార్యక్రమంలో జస్టిస్ యాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి పౌరస్మృతి ముఖ్య లక్ష్యం.. సామాజిక సామరస్యం, లింగ సమానత్వం, లౌకికవాదం అని పేర్కొన్నారు. ఆ తర్వాత రోజు సామాజిక మాధ్యమాల్లో జడ్జి ప్రసంగానికి సంబంధించిన వీడియోలు వైరలయ్యాయి. అందులో మెజారిటీ వర్గం అభీష్టానికి అనుగుణంగా దేశంలో చట్టం నడుచుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. జస్టిస్ యాదవ్ ప్రసంగాన్ని విపక్ష పార్టీలు తప్పుబట్టాయి. దీన్ని విద్వేష ప్రసంగంగా పేర్కొన్నాయి.