కేంద్ర హోంమంత్రి అమిత్ షా
– హింసాకాండ కేసులపై సిబిఐ దర్యాప్తు
ఇంఫాల్ / న్యూఢిల్లీ : మణిపూర్‌లో కొనసాగుతున్న ఘర్షణలపై హైకోర్టు రిటైర్డ్ ప్రధానన్యాయమూర్తి అధ్యక్షతన జ్యుడిషియల్ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు ఇంఫాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరు గ్రూపులు శాంతి, సంయమనం పాటించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో వదంతులు వ్యాప్తి చెందే వీలుందని, ప్రజలు వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో జరిగిన హింసాకాండను ‘ఆదివాసీ జాతుల మధ్య హింస’గా అమిత్ షా పేర్కొన్నారు. హింసాకాండకు దారితీసిన కారణాలు ఏమిటీ? దీనికి బాధ్యులు ఎవరు? అనేది విచారణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం తరుపున నివేదిస్తుందని తెలిపారు.
ఆదివాసీ గ్రూపులకు బెదిరింపులు
అతివాద సంస్థల కార్యాకలాపాలను రద్దు చేస్తూ కుదుర్చుకున్న సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (సూ) ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కుకి సాయుధ గ్రూపులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. 2008లో రెండు ఆదివాసీ కుకి గ్రూపులైన యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ (యుపిఎఫ్), కుకి నేషనల్ ఆర్గనైజేషన్ (కెఎన్‌ఒ) మధ్య ఈ ‘సూ’ ఒప్పందం కుదిరింది. కెఎన్‌ఒ అనేది 24 సాయుధ గ్రూపుల ఐక్య వేదిక. ఈ రెండు గ్రూపుల్లో 2200 మంది సాయుధ కేడర్లు ఉన్నారు. ‘సూ’ ఒప్పందం ప్రకారం ఇరు గ్రూపులకు చెందిన సాయుధులు తమ ఆయుధాలను నిర్దేశిత శిబిరాల్లో అప్పగించాల్సి వుంటుంది. గత మే నెల 3న మొదలైన ఘర్షణల్లో మేయితేయీ గ్రూప్స్‌పై కుకి గ్రూపులు ఈ ఆయుధాలను వినియోగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారు. ‘సూ గ్రూపులను కఠినంగా హెచ్చరిస్తున్నాం. ఒప్పందానికి సంబంధించి ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఒప్పంద నిబంధనల అమలుపై నిశితంగా పర్యవేక్షిస్తాం’ అని ఆయన చెప్పారు. ఆరాంబాయి తెంగ్గోల్, మేయితేయీ లీపున్ వంటి మేయితేయీ గ్రూపులు పోలీసు ఆయుధాగారాల నుంచి ఆయుధాలను లూటీ చేసి గిరిజన ప్రజలపై దాడులు చేస్తున్నట్లు కుకి గ్రూపులు ఆరోపిస్తున్నా యి. గత మే నెల 3 తర్వాత సుమారు 1429 ఆయుధాలను లూటీ చేసినట్లు ఆ గ్రూపులు పేర్కొన్నాయి. ఈ ఆయు ధాలన్నిటిని పోలీసులకు అప్పగించాలని సాయుధ గ్రూపుల ను గురువారం నాడు అమిత్ షా కోరారు. ఆయుధాలను అప్పగించకపోతే ఈ నెల 2వ తేదీ శుక్రవారం నుంచే కూంబింగ్ ఆపరేషన్‌ను పోలీసులు చేపడుతారని తెలిపారు. ఆయుధాలున్నవారిపై కఠిన చర్యలు ఉంటాయని షా బెదిరించారు.
సిబిఐతో దర్యాప్తు
మణిపూర్‌లో హింసాకాండకు సంబంధించి ఇప్పటి వరకు నమోదైన కేసులన్నింటిలో నుంచి ఐదు కేసులను ఎంపిక చేసుకొని వాటిని ఒకే జనరల్ ‘కుట్ర’ కేసుగా నమోదు చేసి కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) దర్యాప్తు చేస్తుందని అమిత్ షా తెలిపారు. అలాగే మణిపూర్ గవర్నరు అనుసూయ ఉయికె నేతృత్వంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పౌర సమాజ గ్రూపులకు చెందిన వారితో ఒక శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని షా చెప్పారు. వివిధ రక్షణ ఏజెన్సీలకు సంబంధించిన బలగాలు మణిపూర్‌లో శాంతిస్థాపనకు పనిచేస్తున్నాయని, వాటిని అన్నిటిని కలిపి కేంద్ర పోలీసు రిజర్వు బలగాలు (సిఆర్‌పిఎఫ్) రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ కులదీప్ సింగ్ నేతృత్వంలో నడిచేలా ఒకే కమాండ్ కిందకు తక్షణమే తీసు కొస్తామని తెలిపారు. మణిపూర్‌లో హింసాకాండ ప్రారంభ మైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి భద్రతా సలహాదారుగా కులదీప్ సింగ్ ఇదివరకే నియమితులయ్యారు.
కోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నందునే…
మణిపూర్‌లో గత ఆరేళ్లుగా అశాంతియుత వాతావర ణమే నెలకొని ఉందని షా తెలిపారు. ఇటీవల కోర్టు ఇచ్చిన ఒక తీర్పును తప్పుగా అర్థం చేసుకోవడం, ఇతర అను మానాల కారణంగా ప్రస్తుతం హింసకు దారితీసినట్లుగా ఆయన చెప్పారు. మేయితేయీలను షెడ్యూల్డ్ తెగల జాబి తాలో చేర్చేందుకు వీలుగా నాలుగు వారాల్లోగా ప్రతిపాదన లు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఈ ఏడాది మార్చి 27న ఆదేశించింది. ఇప్పటికే షెడూల్డ్ తెగలుగా ఉంటున్న 34 తెగలు హైకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 34 శాతంగా ఉన్న ఈ 34 తెగలు అత్యధికం కొండిపాంత జిల్లాల్లోనే ఉంటు న్నాయి. ఛురచందాపూర్‌లో మే 3న వీరికి సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక అప్పటి నుంచి మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతూనేవుంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కర్ఫ్యూ కొనసాగుతోంది.
సరిహద్దులో 80 కిలోమీటర్ల వరకు కంచె
కాగా మణిపూర్ – మయన్మార్ సరిహద్దులో 10 కిలోమీటర్ల వరకు కంచె ఏర్పాటు చేశామని, దీనిని త్వరలోనే 80 కిలోమీటర్ల వరకు పొడిగిస్తామని అమిత్ షా చెప్పారు. మయన్మార్ నుంచి అక్రమ వలసల గురించి విలేకర్లు ప్రశ్నించగా..సరిహద్ద ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు బయోమెట్రిక్, ఐరిస్ స్కాన్, వేలుముద్రలు తీసుకొని నిశితంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. భారత్- మయన్మార్ మధ్య ఫ్రీ మూవ్‌మెంట్ (వీసాలు అవసరం లేకుండా) ఒప్పందం ఉంది. కొండ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి రూ.2 వేలు ధరతో హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభిస్తామని, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ప్రయాణించేందుకు, విమానశ్ర యాలకు వెళ్లేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అయితే కొండ ప్రాంతాల నుంచి ఇంఫాల్‌లో తమ ప్రాణాలకు రక్షణ ఉండదని, పొరుగు నున్న ఐజ్వాల్, గౌహతికి హెలికాప్టర్ సర్వీసులు నడపాలని కొండ ప్రాంత ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. కాగా మణిపూర్ ప్రస్తుత డిజిపి పి డౌంజెల్‌ను తొలగించి ఆయన స్థానంలో సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ సింగ్‌ను డిజిపిగా నియమించారు. డౌంజెల్‌ను ఒఎస్‌డి (హోం)కు బదిలీ చేశారు.