రసవత్తరంగా కోదాడ రాజకీయం

– కారు దిగి చెయ్యి  పట్టుకోనున్న చందర్రావు , శశిధర్ రెడ్డి…?
– పార్టీలోకి రావాలని నేరుగా ఆహ్వానించిన ఎంపీ ఉత్తమ్
– త్వరలోనే భారీ బహిరంగ సభతో అనేకమంది నాయకులు కాంగ్రెస్ లో కి చేరేందుకు ఏర్పాట్లు…
నవతెలంగాణ- కోదాడ రూరల్:
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో కారుకి ఎదురుగాలి వియడం తో పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, తెలంగాణ ఉద్యమకారుడుగా, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ కారు దిగి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెయ్యి పట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మంగళవారం రంగం సిద్ధం చేసుకున్నారు. వారితో పాటు పలువురు ముఖ్య నేతలు ఎర్నేని వెంకటరత్నం బాబు, ముత్తవరపు పాండురంగారావు సైతం, పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్లో చేరుతారు అనే వార్తల వినిపించిన, వాటిని నిజం చేసేలా మంగళవారం నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా  మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు ఇంటికి వెళ్లి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. వారితో సుదీర్ఘంగా భేటీ అయి పలు రాజకీయ అంశాలను చర్చించారు. అనంతరం అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలోని శశిధర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శశిధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఉత్తమ్ కలిసి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పార్టీలోకి తప్పనిసరిగా రావాలని సముచిత స్థానం కల్పిస్తానని శశిధర్ రెడ్డికి ఉత్తమ్ హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన చందర్రావు, శశిధర్ రెడ్డి వారితో పాటు పలువురు జడ్పిటిసిలు ఎంపీపీలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో పట్టణంలో  భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలోకి చేరుతామని ఎంపీ ఉత్తమకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చందర్రావు ఉత్తంకుమార్ రెడ్డి ఇరువురు ఒక దగ్గర కలవడంతో కోదాడ రాజకీయం రసవత్తరంగా  మారింది. బీఆర్ఎస్ నుండి పలువురు ముఖ్య నాయకులు పార్టీలో చేరుతూ ఉండడంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తుందని  పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అనంతగిరి ఎంపీపీ కాంగ్రెస్ లోకి జంప్..
అనంతగిరి మండల ఎంపీపీ చండూరు వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. గత కొన్ని రోజులుగా ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీకి కార్యక్రమాలలో హాజరవుతున్న అంటి మట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎంపీపీ అయినప్పటికీ నాకు మండలంలో సరైన ప్రధానత ఇవ్వలేదని పదవులు లేని వారికి ప్రాధాన్యత ఇచ్చారంటూ అయిన పలుమార్లు ప్రకటనలు చేశారు. అప్పటినుండే ఆయనకు ఎమ్మెల్యేకు మధ్య దూరం మరింత పెరుగుతూ వచ్చింది. మొదటినుంచి ఎంపీపీ చుండూరి చందర్రావు మాటకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉండేవారు. ఆయన పార్టీ మారితే తప్పనిసరిగా నేను పార్టీ మారుతానంటూ విలేకరుల ముందు పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే చందర్రావు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉండడంతో ఎంపీపీ సైతం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎంపీపీ తో పాటు ఓ మండల ప్రజా ప్రతినిధి, ఓ ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్, ముగ్గురు సర్పంచులు, పలువురు నాయకులు పార్టీలో చేరుతున్నట్లుగా సమాచారం…. ఇదిలా ఉండగా అనంతగిరి మండల పార్టీ ముఖ్య నాయకుడు సైతం కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా పార్టీ మారుతారని కాంగ్రెస్ లో చేరుతారని విస్తృతంగా ప్రచారం సాగింది. కానీ మంగళవారం ఆ ముఖ్య నాయకుడు ఇంటికి నియోజకవర్గ చిలుకూరు మండల ప్రజా ప్రతినిధి స్వయంగా వెళ్లి ఆ నాయకుడితో మాట్లాడి నేరుగా నియోజకవర్గ ప్రజా ప్రతినిధి వద్దకు తీసుకువెళ్లి మాట్లాడించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆ నాయకుడు సానుకూలంగా స్పందించి తన ఆలోచనను విరమింపజేసినట్లుగా తెలిసింది.
కోదాడ మండలం గుడిబండ నుండి 70 మందికి పైగా నాయకులు కాంగ్రెస్ లోకి….?
 మండల పరిధిలోని గుడిబండ గ్రామం నుండి టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న సుమారు 70 మంది కి పైగా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు చర్చ జరుగుతుంది. అంతేకాకుండా వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు కూడా చేరనున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వలసల పర్వం మరింత ఊపొందుకునే అవకాశాలు ఉన్నాయని, ఈ చేరికలతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ప్రజలే నిర్ణయిస్తారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Spread the love