సుంకిశాల సైడ్ వాల్ కూలిపోవడంపై సమగ్ర దర్యాప్తు జరపాలి: జూలకంటి రంగారెడ్డి

A thorough investigation should be conducted into the collapse of the tank side wall: Julakanti Rangareddy– సీపీఐ(ఎం) పరిశీలన బృందం సందర్శన
నవతెలంగాణ – పెద్దవూర
సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిపోవడంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అందుకు బాధ్యులైన వారిపై చట్ట రిత్యా చర్య తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం  సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ పడిపోయిన ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. నిర్మాణం చేస్తున్న మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కాల పరిమితిలో నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఈ ప్రాజెక్టుపై జరుగుతున్న పనులను పర్యవేక్షించడం లేదన్నారు. కూలిపోయిన సమయంలో పనిచేసే వాళ్ళు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదన్నారు. పర్వేదుల నుండి సుంకిశాల ప్రాజెక్టు వరకు రోడ్డు అద్వానంగా ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పనులు కూడా చేయలేదని చెప్పారు. నిర్మాణం చేస్తున్న సంస్థ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని, వరదలు పైనుండి వస్తున్నప్పుడు సిమెంటు పనులు చేయడం, సరిగా క్యూరింగ్ కాలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న పనులపై నిరంతరం పర్యవేక్షణ పెట్టి త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతినిధి బృందంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు బండా శ్రీశైలం, కూనురెడ్డి నాగిరెడ్డి, చిన్నపాక లక్ష్మీనారాయణ, మహమ్మద్ సలీం, పి నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, షేక్ బషీర్, పూల సత్యనారాయణ, దుబ్బ రామచంద్రం, బాపు రెడ్డి తదితరులు ఉన్నారు.
Spread the love