– జోరుగా రాజకీయ వలసలు
– పార్టీలు మారుతున్న నాయకులు
– ప్రత్యర్ధుల చిత్తుకు, ఎత్తుకుపై ఎత్తులు
– పదవులు ఆశా చూపుతున్న పార్టీలు రసవత్తరంగా రాజకీయాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ మంథని నియోజకవర్గంలో జంపింగ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. సాధారణ కార్యకర్తలు మొదలుకొని నియోజకవర్గ, మండల, గ్రామాల కీలక నాయకుల దాకా పార్టీలు మారుతున్నారు.పార్టీలో ఉన్నవారిని కాపాడుకోవడంతో పాటు ఇతర పార్టీల నాయకులకు గాలం వేయడం పార్టీ విడిన వారిని మళ్ళీ సొంత గుటీకి ఆహ్వానించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి వర్గాన్ని మానసికంగా కుంగతీసేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తులను తమవైపు లాక్కునేందుకు హ్యూహాలకు పదును పెడుతున్నారు.
పదవులు.. బోలెడు ఆఫర్లు..
అధికారంలోకి రాగానే స్థానిక పదవుల్లో కొందరికి రాష్ట్ర స్థాయి పదవులు మరికొందరికి అవకాశం కల్పిస్తామని ఆశ చూపుతూ పార్టీలలోకి చేరుకుంటున్నారు. మరికొందరికి ఆర్థికంగా భరోసాను సైతం కల్పిస్తున్నారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ప్రతి ఊరిలో చేరికలు ఉండెలా నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని పార్టీలు ప్రదానంగా మండల స్థాయి, ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి కేంద్రీకరించారు. ఇతర పార్టీల మండల అధ్యక్షులు, సర్పంచ్ లు, వార్డు నెంబర్లు, ముఖ్య నాయకులను చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ జంపింగ్ లు ఎక్కువ కావడంతో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది.