జూన్ 2 తెలంగాణకు సోనియా..

నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ జూన్ 2న తెలంగాణకు రానున్నారు. యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. దాదాపు 10 ఏండ్లు తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆవిర్భావ దినోత్సవం రోజున సోనియాగాంధీ చేత తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని విడుదల చేయనుంది. “జయ జయ హే తెలంగాణ” అనే గీతాన్ని ప్రముఖ కవి మరియు గేయ రచయిత అందె శ్రీ రచించారు. ఈ గీతాన్ని ఫిబ్రవరి 4 న క్యాబినెట్ అధికారికంగా రాష్ట్ర గీతంగా ఆమోదించింది. ప్రస్తుత సందర్భాన్ని ప్రతిబింబించేలా గీతంలో స్వల్ప మార్పులను మంత్రివర్గం సూచించింది. దాదాపు 1.5 నిమిషాల నిడివి గల తుది వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ గీతానికి సంగీతాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు.

Spread the love