జూన్‌ గుబులు..!

June bushes..!– ఫీజులు పెంచిన ప్రయివేటు పాఠశాలలు
– గతేడాది కంటే 20-40 శాతం అధికం
– విద్యాహక్కు చట్టానికి యథేచ్ఛగా తూట్లు
– చితికిపోతున్న మధ్య తరగతి కుటుంబాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మరో రెండు రోజుల్లో బడి గంట మోగనున్నాయి. మారిన సామాజిక పరిస్థితుల్లో అప్పు చేసైనా తమ పిల్లలను పేరున్న పాఠశాలలో చదివించాలని తల్లిదండ్రులు తపనపడుతుంటారు. దీన్ని ఆసరా చేసుకుంటున్న కొన్ని ప్రయివేటు స్కూల్స్‌ కొత్త ప్రవేశాలు, డొనేషన్లు, నెలవారీ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్‌, షూస్‌, బ్యాగులు, రవాణా చార్జీల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల జేబుకు చిల్లు పెడుతున్నారు. జూన్‌ వచ్చిందంటే చాలు అనేక ఖర్చులు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఈ భారాలతో మధ్య తరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి.
కొత్త పేర్లు.. కొత్త స్కూళ్లు..
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఇంటర్నేషనల్‌, టెక్నో, ఈ-టెక్నో, ఒలంపియాడ్‌, భూం భూం, విజన్‌ కేతనం, టాలెంట్‌ అంటూ చివరన పేర్లు పెట్టి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఫీజులతో పాటు పాఠ్యపుస్తకాలు, నోటు బుక్స్‌, బ్యాగ్స్‌ సైతం విక్రయిస్తున్నారు. మరికొన్ని పాఠశాలలకు అనుబంధంగా బుక్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేసి, అక్కడే బుక్స్‌ కొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యూనిఫామ్‌లు, క్యారేజ్‌ బ్యాగ్‌, షూస్‌ వంటివి కూడా పాఠశాల వాళ్లు చెప్పిన దగ్గరే కొనుగోలు చేయాలని నిబంధనలు పెడుతున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పుస్తకాలను విక్రయించొచ్చని డీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని స్కూల్స్‌ యథేచ్ఛగా పాఠశాలలోనే పుస్తకాల విక్రయానికి తెరలేపాయి. ఇక స్కూల్‌ బస్సు రవాణాకు ఫీజు అదనం.
రకరకాల ఫీజులు..
ప్రయివేటు పాఠశాలల్లో రకరకాల పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.5 వేల నుంచి రూ.10వేలు, అడ్మిషన్‌ ఫీజు రూ.5వేల నుంచి రూ.10వేలు, నర్సరీకి బుక్స్‌, స్టూడెంట్‌ కిట్‌ రూ.15 వేల నుంచి రూ.20వేలు వసూలు చేస్తున్నారు. ఓ సాధారణ ప్రయివేటు స్కూల్‌లో రెండు జతల బట్టలకు రూ.8 వేల నుంచి రూ.10వేలు, స్పోర్స్‌ డ్రెస్‌ రూ.2 వేల నుంచి రూ.5 వేలు, టై, బెల్ట్‌, బ్యాడ్జీ కలిపి రూ.5వేలు, రెండు జతల షూస్‌ కలిపి రూ.1500 వరకు చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు, డీజిల్‌ ధరలు, బస్సుల మెయింటెనెన్స్‌కు ఖర్చులు పెరిగాయంటూ అదనంగా కిలోమీటర్లను బట్టి వసూలు చేస్తున్నారు. 5 కి.మీ పరిధిలో రూ.10 వేల నుంచి రూ.25 వేలు, 5 నుంచి 10 కి.మీ.లకు రూ.30వేలు, 10 కి.మీ కంటే ఎక్కువైతే రూ.40 వేలు వసూలు చేస్తున్నారు. పిల్లల ఫీజులకు తోడు రవాణా ఛార్జీల భారంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి ఫీజు మొత్తం చెల్లిస్తే 10 శాతం రాయితీ ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికైనా సర్కార్‌ స్పందించి ఈ ఫీజు దోపిడీని అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
20-40శాతం ఫీజు పెంపు
ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నాయి. గతేడాది కంటే ఈసారి 20-40 శాతం ఫీజులు పెంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఎన్ని కష్టాలెదురైనా సరే.. తమ పిల్లలను బాగా చదివించాలనే తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు సొమ్ము చేసుకుంటూ, జలగల్లా పీల్చిపిప్పి చేస్తున్నాయి. పిల్లలకు ఉత్తమ విద్యనందించాలనే ఆశ ఒక వైపు, అధిక ఫీజులతో మోయలేని భారం మరో వైపుతో తల్లిదండ్రులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికి తోడు ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో ఫీజులు హడలెత్తిస్తున్నాయి.
ఫీజుల నియంత్రణ కరువు
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ప్లే స్కూల్స్‌ 100, యూపీఎస్‌ స్కూల్స్‌ 550, హై స్కూల్స్‌ వెయ్యి వరకు ఉన్నాయి. ఇలా మొత్తం కలిపి 1600 వరకు ప్రయివేటు స్కూల్స్‌ ఉన్నాయి. వీటిల్లో ఫీజుల నియంత్రణ కొరవడింది. ప్రయివేటు, కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో ఫీజులను నియంత్రించడానికి 2017లో ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ తిరుపతిరావు అధ్యక్షతన అప్పటి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఏటా ఫీజులను ఎంత పెంచాలనే దానిపై ఈ కమిటీ నివేదికను సమర్పించింది. ఆ నివేదికను ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడంతో ప్రయివేటు స్కూల్స్‌ ఆడిందే ఆట.. పాటిందే పాట అన్న చందంగా మారింది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఫీజులపై స్పష్టత లేకపోవడంతో ప్రయివేటు స్కూల్స్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు.
సర్కార్‌ వెంటనే స్పందించాలి
ప్రయివేటు, కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో ఫీజుల వసూలుపై సర్కార్‌పై వెంటనే స్పందించాలి. సీబీఎస్‌ఈ, ఐసీఎస్సీ లాంటి పేర్లతో స్కూల్స్‌ పెట్టి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రతీ ఏడాది 40శాతం ఫీజులు పెంచడం సరికాదు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి. విద్యాశాఖా మంత్రి లేకపోవడంతో స్కూళ్లపై పర్యవేక్షణ కొరవడింది. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి.
రాథోడ్‌ సంతోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ మేడ్చల్‌
-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి

Spread the love