ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ప్రమాణస్వీకారం

నతెలంగాణ – విజయవాడ: ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ పదోన్నతిపై సీజేగా ఏపీ హైకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకుర్‌ తమ్ముడే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌. ఆయన 1964 ఏప్రిల్‌ 25న జన్మించారు. 1989 అక్టోబరు 18న ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్‌ న్యాయవాదిగా హౌదా పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్‌ 10న బాంబే హైకోర్టుకు బదిలీ అయి సేవలు అందించారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జిల వరకు ఉండొచ్చు. సీజేగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ రాకతో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది.

Spread the love