– పార్లమెంట్‌లో అన్ని పార్టీల కేరళ ఎంపీల ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జస్టిస్ ఫర్ వాయనాడ్ అంటూ కేరళకు చెందిన ఎంపీలు నినదించారు. శనివారం పార్లమెంట్ ఆవరణంలో ఆందోళన చేపట్టారు. కొండచరియలు విరిగిపడిన ప్రకృతి విలయంలో భారీగా నష్టం వాటిల్లిన వాయనాడ్‌కు సహాయ ప్యాకేజీ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐ(ఎం) ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వి.శివదాసన్, కాంగ్రెస్ ఎంపీలు కెసి వేణుగోపాల్, కె.సురేష్, ఐయూఎంఎల్ ఎంపీ మహ్మద్ బషీర్, ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్‌తో సహా కేరళలోని అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంటులోని మకర్ ద్వార్ వద్ద ఆందోళన చేపట్టారు. ‘జస్టిస్ ఫర్ వాయనాడ్. వాయనాడ్‌కు రిలీఫ్ ప్యాకేజీ అందించండి’ అన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. ‘వాయనాడ్‌కు న్యాయం చేయండి. వివక్ష చూపవద్దు’ అని నినాదాలు హౌరెత్తించారు. వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు. వాయనాడ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నదని ఆరోపించారు. వాయనాడ్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్‌లోని బాధితులను రాజకీయాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు.ప్రకతి వైపరీత్యాల సమయంలో వివక్ష చూపకూడదని ఆమె అన్నారు. కాగా డిసెంబర్ 3న కేరళ ప్రతిపక్ష ఎంపీలంతా కేంద్ర హౌం మంత్రి అమిత్ షాని కలిసి వినతి పత్రం ఇచ్చారు. తక్షణ సహాయం అందించాలని కోరారు. జులై 30న భారీ వర్షాలకు వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 300 మందికిపైగా మరణించగా అనేక ఇండ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి.