తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ నవీన్‌రావు

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ నవీన్‌రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఒక్కరోజే సీజేగా కొనసాగనున్నట్లు కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా అత్యంత సీనియర్‌ జడ్జి అయిన జస్టిస్‌ నవీన్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే జస్టిస్‌ నవీన్‌రావు శుక్రవారం పదవీ విరమణ చేయనుండటంతో ఆయన ఈ ఒక్కరోజే ఆ పదవిలో కొనసాగుతారు. మరుసటి రోజు నుంచి సీనియారిటీలో ముందు వరుసలో ఉన్న జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర న్యాయశాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలాఉండగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Spread the love