బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

Justice should be given to the victim's family– పారిశుధ్య కార్మికులతో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
– డ్రయినేజీలో పడి మృతి చెందిన కార్మికుని కుటుంబానికి న్యాయం చేస్తాం: ఆర్డీవో రవీందర్‌ రెడ్డి హామీ
– డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు అందిస్తా : ఎమ్మెల్యే జీఎంఆర్‌
నవతెలంగాణ-ఐడీఏ బొల్లారం
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్‌లోని బాలాజీనగర్‌లో డ్రయినేజీలో సోమవారం చెత్తా చెదారాన్ని తొలగిస్తూ ప్రమాదవశాత్తు అందులోనే పడి మృతిచెందిన కార్మికుడు నరసింహ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులతో కలిసి పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ కార్మిక నాయకులు నాగేశ్వరరావు, వరప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల పట్ల మున్సిపల్‌ అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లనే కార్మికుడు మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేసే ప్రతి కార్మికుని వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకొని భద్రతాచర్యలు పాటించాలని అధికారులను కోరారు. మృతి చెందిన కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఆర్డీవో రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ మంగతాయారుతో కలిసి నిరసనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించడంతో పాటు మున్సిపల్‌ ద్వారా వచ్చే బెనిఫిట్స్‌నూ అందిస్తా మన్నారు. అలాగే, కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు వచ్చేలా కలెక్టర్‌తో మాట్లాడతానని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో కార్మికులు ధర్నా విరమిం చారు. ఈ కార్యక్రమంలో బాలాజీనగర్‌ కౌన్సిలర్‌ సుజాత మహేందర్‌రెడ్డి, స్థానిక సీఐ గంగాధర్‌, మున్సిపల్‌ మేనేజర్లు మల్లికార్జున్‌, నిర్మలారెడ్డి, పారిశుధ్య కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు.

Spread the love