విద్యారంగం అభివృద్ధికి జేవీవీ కృషి

JVV's efforts for the development of education sector– 8 తీర్మానాలకు రాష్ట్ర కమిటీ ఆమోదం
– జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
నవతెలంగాణ-సిటీబ్యూరో
జన విజ్ఞాన వేదిక విద్యా రంగం అభివృద్ధికి కృషి చేస్తూ, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా యాక్టీవ్‌గా పని చేస్తున్నదని జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకట్‌రావు అన్నారు. జనవిజ్ఞాన వేదిక 5వ రాష్ట్ర మహాసభల సందర్భంగా అనుపురం కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాల్లో టీచర్స్‌కు ట్రైనింగ్‌ కూడా ఇస్తున్నామని, విద్యా రంగంతోపాటు వివిధ రంగాల్లో కూడా పని చేస్తున్నామని తెలిపారు. జేవీవీ మాజీ అధ్యక్షులు అందె సత్యం మాట్లాడుతూ.. జేవీవీ అక్షరాశ్యతను పెంపొందించడానికి కృషి చేస్తున్నదని చెప్పారు. నేడు చేతబడులు చాలా వరకు తగ్గాయనీ, హత్యలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పని చేస్తూ పోలీస్‌ శాఖ సహకారంతో కలిసి ముందుకెళ్తున్నామని అన్నారు. విద్యా శాస్త్రీయత పెరిగితే ప్రపంచంతో పోటీ పడవచ్చని అన్నారు. పబ్లిక్‌ హెల్త్‌ను ఇంకా మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని, బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని కోరారు. హైడ్రాను జేవీవీ అభినందిస్తుందనీ, పేదలు ఉంటే ప్రత్యామ్నాయం చూపించాలని తెలిపారు. ప్రొఫెసర్‌ బీఎన్‌ రెడ్డి మాట్లాడుతూ.. జేవీవీ అగ్రికల్చర్‌, సైన్స్‌, ఎన్విరాన్మెంట్‌ లాంటి సమస్యలపై పని చేస్తుందని తెలిపారు. ప్రతి ఏడాదీ దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులకు చెకుముఖి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జేవీవీ ఉపాధ్యక్షులు రమాదేవి మాట్లాడుతూ.. ప్రజారోగ్యంపై జేవీవీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుందన్నారు. చేప మందు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని జేవీవీ నిరూపించినట్టు తెలిపారు. వైద్యం పేద ప్రజలకు అందుబాటులో లేదనీ, పటిష్ట పర్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్‌ను నియంత్రిస్తూ, ప్రజలకు పబ్లిక్‌ హెల్త్‌ అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌ను అభివృద్ధి చేయాలి కోరారు. ప్రజారోగ్యంపై భవిష్యత్‌లోనూ పని చేస్తామని తెలిపారు. చెకుముఖి ఎడిటర్‌ సత్య ప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రజల్లో సైంటిఫిక్‌ టెంపర్‌ను కలిగించడం తమ ప్రాథమిక కర్తవ్యం అన్నారు. చెకుముఖి పుస్తకంలో అన్ని రకాల వివరాలు ఉన్నాయనీ, ఇది లార్జెస్ట్‌ సర్క్యులర్‌ సైన్స్‌ మంత్లీగా ఉందని తెలిపారు. విద్యార్థుల్లోకి సైన్స్‌ను తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం కొన్ని తీర్మానాలను ఆమోదించారు.
ఆమోదించిన తీర్మానాలు
మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలన్నారు. విద్యా కమిషన్‌ ఏర్పాటును స్వాగతిస్తూ, శాస్త్రీయమైన విద్యా విధానాన్ని రూపొందించి అమలు చేయాలని, పాఠశాల, ఉన్నత విద్యలో మతపరమైన అంశాలు బోధనాంశాలుగా ఉండకూడదని తీర్మానించారు. విద్య, వైద్యం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని, వైద్య కళాశాలలు, వైద్య సేవలపై వ్యాపార ధోరణుల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. శాస్త్ర సాంకేతిక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర కేంద్రంలో తెలంగాణ సైన్స్‌ మ్యూజియంను, జిల్లాల్లో సైన్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. హైడ్రాను సమర్థవంతంగా నిర్వహించాలని, చట్టబద్ధంగా అనుమతి ఉన్న మధ్యతరగతి నిర్మాణాలను కులగొట్టకూడదని, పేదలకు ప్రత్యేక ప్రత్యామ్నాయ గృహవసతి కల్పించాలని, చెరువులు, కుంటలతోపాటు అడవుల సంరక్షణ కూడా హైడ్రా పరిధిలోకి తీసుకోవాలని తీర్మానం చేశారు. మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్‌లను నిషేధించాలని, పాఠశాల, కళాశాలల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ తరగతిని ఖచ్చితంగా ప్రతిరోజూ నిర్వహించాలని తీర్మానించారు.
జేవీవీ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
జన విజ్ఞాన వేదిక నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షులుగా చెలిమెల రాజేశ్వర్‌, ఉపాధ్యక్షులుగా ప్రొఫెసర్‌ డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ప్రొఫెసర్‌ బీఎన్‌.రెడ్డి, ఎస్‌.జితేందర్‌, అలవాల నాగేశ్వరరావు, ఆర్‌.వెంకటేశ్వరరావు, రావుల వరప్రసాద్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజా, కార్యదర్శులుగా రవీందర్‌రెడ్డి, గంగరాజు, వెంకట రమణారెడ్డి, మహేంద్రం, శ్రీనివాసరావు, వెంకట రమణను ఎన్నుకున్నారు. కోశాధికారిగా నాగరాజుతోపాటు మొత్తం 25 మందిని రాష్ట్ర సెక్రటేరియట్‌ మెంబర్స్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Spread the love