-100 మీ హార్డిల్స్‌లో స్వర్ణం సొంతం
– అజరు, అబ్దుల్లాకు సైతం గోల్డ్ మెడల్స్
– ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్
– బ్యాంకాక్ (థారులాండ్)
– భారత స్టార్ స్ప్రింటర్, తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజి కెరీర్ అత్యుత్తమ పరుగుతో అదరగొట్టింది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించిన జ్యోతి.. కెరీర్‌లో తొలిసారి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పసిడి విజేతగా నిలిచింది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో జ్యోతి ఎర్రాజి అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకం సొంతం చేసుకుంది. మెన్స్ 1500 మీటర్ల రేసులో అజరు కుమార్ సరోజ్, మెన్స్ ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్ సైతం పసిడి పతక ప్రదర్శన చేశారు. ఐశ్వర్య మిశ్రా, తేజస్విని శంకర్‌లు సైతం ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ రెండో రోజు పోటీల్లో పతకాలు సాధించారు. ప్రస్తుతం భారత్ మూడు పసిడి, మూడు కాంస్య పతకాలు సొంతం చేసుకుంది.
పసిడి జ్యోతి : జాతీయ చాంపియన్‌షిప్స్‌లో 12.82 సెకండ్లతో రికార్డు నెలకొల్పిన జ్యోతి ఎర్రాజి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి ఫేవరేట్‌గా బరిలో నిలిచింది. జూన్‌లో జరిగిన ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్స్‌లో సైతం 12.92 సెకండ్లతో స్వర్ణం సాధించింది. వర్షం కురిసిన ట్రాక్‌పై ప్రతికూల పరిస్థితుల్లో జ్యోతి ఎర్రాజి పసిడి నెగ్గింది. సరిగ్గా అటువంటి పరిస్థితుల్లోనే బ్యాంకాక్ సుపచలసాయి స్టేడియంలో బంగారు పతకం ముద్దాడింది. తడిగా ఉన్న ట్రాక్‌పై 100 మీటర్ల హార్డిల్స్ రేసును 13.09 సెకండ్లలోమ ముగించింది. జపాన్ స్ప్రింటర్లు అసుక (13.13), మసుమి (12.26) రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
పురుషుల 1500 మీటర్ల పరుగులో 26 ఏండ్ల అజరు కుమార్ సరోజ్ మెరుపు వేగంతో పరుగెత్తాడు. 3.41.51 సెకండ్లలో రేసు పూర్తి చేసిన అజరు కుమార్ వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనకు మరో రెండు సెకండ్ల వెనుకంజ వేసినా.. పసిడి సొంతం చేసుకున్నాడు. అజరు కుమార్‌కు ఇది వరుసగా మూడో పతకం కాగా రెండో పసిడి కావటం విశేషం. ఇటీవల అమెరికాలో శిక్షణ తీసుకున్న అజరు కుమార్.. 2017 భువనేశ్వర్, 2019 దోహా చాంపియన్‌షిప్స్‌లో పసిడి, రజత పతకాలు సాధించాడు. కామన్‌వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన అబ్దుల్లా అబూబాకర్ మెన్స్ ట్రిపుల్ జంప్‌లో మెరిశాడు. 16.92 మీటర్ల జంప్‌తో.. జపాన్ (16.73), దక్షిణ కొరియా (16.59) అథ్లెట్లను వెనక్కి నెట్టి బంగారు పతకం అందుకున్నాడు. మహిళల 400 మీటర్ల రేసులో ఐశ్వర్య మిశ్రా 53.07 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. మెన్స్ డెకథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ 7527 పాయింట్లతో సైతం కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.