”కాలం కరుణామయహంతకి” అంటాడు మక్దూం ఓ సందర్భంలో… 2023 సినీ ప్రముఖుల్ని తీసుకుపోతోంది. ఒక్కొక్కర్ని… 92 ఏండ్ల నిండు జీవితం గడిపిన కె.రామలక్ష్మి 3 మార్చి 2023 శుక్రవారం కన్నుమూశారు. కూచి రామలక్ష్మి 1930 డిసెంబర్ 31న ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా కోట నందూరు గ్రామంలో జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని మేరి స్టెల్లా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసారు. రామలక్ష్మి ఆధునిక భావాలు; పురోగమన దృక్పథం, ధిక్కార స్వరం, ఫెమినిస్ట్ ఆలోచనలు ఈమె రచనల్లో కనిపిస్తాయి. దాదాపు 100 పుస్తకాలు రాసారు. ఖసా సుబ్బారావు నడిపిన తెలుగు స్వతంత్ర పత్రికలో ఆంగ్ల విభాగంలో ఉప సంపాదకురాలిగా పనిచేసారు. డా|| సినారె తొలి పుస్తకానికి ఆ పత్రికలో తొట్టతొలిగా సమీక్ష చేసింది రామలక్ష్ష్మీ. 1950 ఏప్రిల్ 30న ఆరుద్రని రిజిస్టర్ మేరేజ్ చేసుకొంది. హెచ్.ఎం. రెడ్డి, శ్రీశ్రీలు నాటి పెండ్లికి పెద్దలూ, సాక్షులు.. ఆదర్శాలు ఆచరణలో చూపాలనే ధోరణి ఆమెది. తెలుగు, హిందీ, తమిళం, సంస్కృతం, ఆంగ్లం భాషల్లో మంచి పట్టు ఉన్న రామలక్ష్మి 15 నవలలు, మూడు కథా సంపుటాలు పలు చిత్రాలకు రచనలు చేసారు. సెన్సార్ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. చిన్నారి పాపలు, జీవనజ్యోతి చిత్రాలకు కథా రచన చేసారు. జీవనజ్యోతికి నంది పురస్కారం వచ్చింది. కథ, నవల, విమర్శ, సమీక్ష, అనువాదం, పాత్రికేయ వృత్తి, సినీ కథలకు రచనలు.. ప్రాచీనాంధ్ర సాహిత్యంపై మంచి పట్టు వున్న రామలక్ష్మి 1954లో విడదీసే రైలు బళ్లు నవల రాసి ప్రఖ్యాతినొందారు. అవతలి గట్టు, మెరుపు తీగె, తొణికిన స్వరం (1961), మానని గాయం, ఆణిముత్యం, పెళ్ళి (2013), కస్తూరి (2001), ప్రేమించు ప్రేమకై, ఆడది, ఆశకు సంకెళ్ళు, కరుణ కథ, లవంగి, ఆంధ్ర నాయకుడు, పండరంగని ప్రతిజ్ఞ మొ|| నవలు రాసారు. రామలక్ష్మి మృతికి తెలుగు సాహిత్యానికి తీరనిలోటు.
– తంగిరాల చక్రవర్తి