నవతెలంగాణ-హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. జీవో 99పై స్టే విధించాలని.. కూల్చివేతలను తక్షణమే ఆపేయాలని కేఏ పాల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికప్పుడు కూల్చివేతలు ఆపలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని.. అక్రమ కట్టడాల కూల్చివేతలకు నెలరోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అనంతరం ప్రతివాదులుగా ఉన్న హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.