మళ్లీ డేంజర్ లో కడెం ప్రాజెక్టు..భారీగా పోటెత్తుతున్న వరద

నవతెలంగాణ-హైదరాబాద్ : కడెం జలాశయం వద్ద వరద మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గతేడాది భారీ ఎత్తున పోటెత్తిన్న వరద భయం మరోసారి కళ్లముందు కదులుతోంది. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి మళ్లీ ప్రమాదకరస్థాయిలో వరద వస్తోంది. సామార్థ్యాన్ని మించి చేరిన భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు కెపాసిటీ 3లక్షల 50 వేలు కాగా… 3లక్షల 87వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో చేరుతోంది. 14 గేట్లను తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. మరో 4 గేట్లు తెరుచుకోకుండా మొరాయిస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 700 అడుగులకు గాను… ప్రస్తుతం నీటిమట్టం 700 అడుగులకు చేరింది. జలాశయం ఔట్‌ ఫ్లో 2.4 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి నీటి ప్రవాహం చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గతేడాది కడెం వరద ఉద్ధృతి కారణంగా అపార నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఏడాదిగా కడెం జలాశయం గేట్ల మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తి కాకముందే మరోసారి వరద ఉద్ధృతి వచ్చి ప్రజలను భయపెడుతోంది.

Spread the love