కడియం దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త

– పార్టీ వ్యతిరేకులు, అసమ్మతివాదులకు ఆయన లీడర్‌
– సోషల్‌ మీడియా గ్లోబెల్స్‌ ప్రచారం నమ్మొద్దు : స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డా. రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్‌
”ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేని ఎన్‌కౌంటర్లు కడియం శ్రీహరి హయాంలో నియోజకవర్గంలో జరిగాయి.. ఇక్కడ దళిత బిడ్డలు ఎక్కువగా ఉన్నారు.. ఊర్లకి వస్తే వారి ఆత్మలు ఘోషిస్తున్నాయి.. ఆయన దేవాదుల సృష్టికర్త కాదు ఎన్‌కౌంటర్ల సృస్టికర్త.. పార్టీ వ్యతిరేకులు, అసమ్మతివాదులకు లీడర్‌..” అని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి నేటికీ బీఆర్‌ఎస్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని పార్టీ నుంచి ఏకగ్రీవంగా సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని తాటికొండ గ్రామంలో ఆదిజాంబవంతుని విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ, దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
నాడు రాజయ్య రాజీనామా చేస్తే తాను పోటీ చేయనన్న కడియం మాట తప్పి.. వెంటనే టీడీపీ నుంచి మొట్టమొదటి పోటీగా వచ్చిన స్వార్థ రాజకీయపరుడని విమర్శించారు. అయినా, ఓడిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి కేసీఆర్‌ వల్ల ఎంపీ, ఉపముఖ్యమంత్రి పదవి పొంది ఒక్కరోజైనా నియోజకవర్గంలో అడుగు పెట్టలేదని ఆరోపించారు. తాను 30యేండ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజా జీవితంలోనే గడుపుతున్నానని చెప్పారు. ఆనాడు టీడీపీ నుంచి పోటీ చేయాలని దగ్గుబాటి వెంకటేశ్వర్లు చెప్పినా, కుటుంబ బాధ్యత వల్ల రాలేనని తిరస్కరించడం వల్లే స్థానికేతరుడైన కడియం నియోజకవర్గంలో అడ్డావేశారని అన్నారు. తన వెంట ఉన్న వారిపై కడియం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇప్పటి నుంచే తన కుమార్తెకే టికెట్‌ అంటూ గోబెల్స్‌ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీగా ప్రభుత్వపరంగా సిడిఎఫ్‌ నిధులు వస్తే స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా చాటుమాటు మీటింగులు పెడుతున్నారన్నారు. మాటిమాటికి నీతిమంతుడనని చెప్తున్న కడియం శ్రీహరి ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆస్తులెన్నో.. తన ఆస్తులెన్నో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. పల్లె నిద్ర పేరిట తాను రైతు వేదికల్లో నిద్ర చేసినా.. నీ చరిత్రలో నియోజకవర్గంలో ఎక్కడన్నా ఒక్క పూట పడుకున్నావా అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో మీకు ఇక్కడ స్థానం లేదన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుకు తానేంటో తెలుసునని, తన అస్తిత్వం ఏంటో తెలుసునని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మెన్‌ మారపాక రవి, ఎంపిపి కందుల రేఖ, సర్పంచ్‌, వైస్‌ ఎంపీపీ దంపతులు చల్లా ఉమా సుధీర్‌ రెడ్డి, ఆకుల కుమార్‌, ఏఎంసీ చైర్మెన్‌ గుజ్జరి రాజు, మండల అధ్యక్షుడు గణేష్‌, సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Spread the love