కాయ్‌ రాజా కాయ్‌

– నెట్టింట బెట్టింగ్‌ దందా
– బిన్ని, జై షా హయాంలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ యాప్‌ల జోరు
– ఐపీఎల్‌లో కాసుల గలగల…కోట్లలో దోపిడీ
– పోలీసుల నిఘా వైఫల్యం
– మెట్రోసిటీల్లో బుకీలు
– ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఎలా వీలైతే అలా..
బీసీసీఐ ప్రెసిడెంట్‌గా రోజర్‌ బిన్ని, సెక్రటరీగా హౌంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా బాధ్యతలు స్వీకరించాక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల పంట పండుతోంది. రూ.కోట్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతూ యువత గుల్లవుతోంది. చివరికి మహిళలు సైతం బెట్టింగ్‌ ఊబీలో కూరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌రాయుళ్లపై పోలీసు నిఘా ఉన్నా ఆన్‌లైన్‌ యాప్‌లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో యువత చిత్తవుతున్నారు. రూ.లక్షల్లో అప్పులు తెచ్చి మరీ ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. పైగా ఈ యాప్‌లను ప్రముఖ క్రికెటర్లు ప్రమోట్‌ చేస్తుండటంతో వెర్రి వ్యామోహంలో యూత్‌ కొట్టుకుపోతుంది. యూపీఐ, జీ పే, ఫోన్‌ పే, పేటీఎం, వీసా, మాస్టర్‌ కార్డు.. ద్వారా డిజిటల్‌ బెట్టింగ్‌ లావాదేవీలు కొనసాగించే అవకాశం ఉండటంతో బెట్టింగ్‌ మోజులో పడి యూత్‌ లూటీ అవుతోంది. ఖమ్మం, కరీంనగర్‌ వంటి ప్రధాన పట్టణాలతోపాటు ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాలన్నీ ఈ బెట్టింగ్‌లకు కేంద్రాలుగా మారాయి.
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గెట్‌ బోనస్‌ పేరుతో అనేక యాప్‌లు పుట్టుకొచ్చాయి. ఒకింత బెట్టింగ్‌ పెట్టి.. మూడింతలు సంపాదించొచ్చనే ప్రచారంతో ఆకట్టుకుంటున్నాయి. 10 క్రిక్‌, 7 క్రిక్‌, ప్లే స్క్వైయిర్‌, లీఆన్‌, కాసినో డేస్‌, క్రిక్‌బాబా, 4రాబెట్‌, విన్‌డాడీ, రాజా బెట్స్‌, మెగా పారీ, 22 బెట్‌, బ్లూ చిప్‌, బెట్‌ టిల్ట్‌, బెట్‌ వే, పారీ మ్యాచ్‌, 1ఎక్స్‌బెట్‌, బెట్‌ 818, గురుబారు, డ్రీమ్‌ 11.. ఇవే కాదు ఇంకా వందల సంస్థలు రకరకాల బెట్టింగ్‌ ఆఫర్‌లతో యూత్‌ను మాయచేసి దోచేస్తున్నాయి. రోజువారీ కూలి పనిచేసుకునే యువత మొదలు ప్రభుత్వ, ప్రయివేటు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల వరకు ఈ బెట్టింగ్‌ మాయలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చైన్‌సిస్టమ్‌ ద్వారా ఒకరి నుంచి మరొకరు ఐడీలు తీసుకుని బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఇవన్నీ అధికారిక బెట్టింగ్‌ సంస్థలు కావడంతో యువత ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకొని రూ.వందల నుంచి రూ.లక్షల వరకు కోల్పోతున్నారు.
బురిడీ కొట్టిస్తున్న బుకీలు
ముఖ్యంగా బెట్టింగ్‌లో బుకీల మాయాజాలం కొనసాగుతోంది. బాల్‌ బాల్‌కు బెట్టింగ్‌.. మ్యాచ్‌ ఎవరు గెలుస్తారు..? ఏ బ్యాట్స్‌మెన్‌ ఎన్ని పరుగులు చేస్తాడు..? ఏ బౌలర్‌ ఎన్ని వికెట్లు పడగొడతాడు..? ఏ ఓవర్‌లో వికెట్‌ పడుతుంది..? మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు ఎన్ని పరుగులు చేస్తుంది..? ఇలా ఒకటేమిటి ఒక్క మ్యాచ్‌కు సంబంధించే అనేక రకాలుగా బెట్టింగ్‌ తంతు కొనసాగుతోంది. ఇంజినీరింగ్‌, డిగ్రీ, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు రూపాయికి పది రూపాయలు ఇస్తామని చెప్పి బెట్టింగ్‌ ఊబీలోకి దించుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత పొద్దస్తమానం కష్టపడి సాయంత్రమైతే చాలు బెట్టింగ్‌
వైపు చూస్తోంది. ఆన్‌లైన్‌లో పరిచయమైన ఫ్రెండ్స్‌ ద్వారా తెలిసిన బుకీలు.. మొబైల్‌ నంబర్‌లకు ఫోన్లు చేసి ఆ రోజు గేమ్‌ స్వరూపంపై విశ్లేషణ చేసి బెట్టింగ్‌కు దించుతున్నారు. బెట్టింగ్‌లో అనుభవజ్ఞులైన కొందరికి వీరే తొలుత పెట్టుబడి పెడుతున్నారని సమాచారం. రూ.50వేలు, రూ.లక్ష వరకు బెట్టింగ్‌కు పాల్పడే వ్యక్తి సామర్థ్యానికి అనుగుణంగా ముందస్తు అప్పులు ఇస్తున్నారని తెలిసింది. బెట్టింగ్‌కు పాల్పడిన వ్యక్తి ఆ రోజు మ్యాచ్‌కు రూ.5వేల బెట్టింగ్‌ పెట్టి రూ.10వేల వరకు రాబడితే దానిలో ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాతిపదికన వీరు ముందస్తు పెట్టుబడి పెడుతున్నట్టు సమాచారం. అది కోల్పోతే మాత్రం ఆ తర్వాత సొమ్మును వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఒప్పందాల కారణంగా స్థానిక యువత అప్పుల పాలవుతున్నట్టు సమాచారం.
నెట్టింటే సర్వం..!
శాస్త్రసాంకేతికత అభివృద్ధి దృష్ట్యా గడిచిన కొన్నేండ్లుగా ఆన్‌లైన్‌లోనే సర్వం కానిచ్చేస్తున్నారు. ఒకప్పుడు సంపన్న వర్గాలకే పరిమితమైన ఈ బెట్టింగ్‌ వ్యసనం ఇప్పుడు పేద, మధ్యతరగతి వర్గాలకూ పాకింది. రోజు కూలీ రూ. 300 నుంచి 500 వరకు సంపాదించే సామాన్యుడు కూడా ఈ రొంపిలో చిక్కుకున్నాడు. రూ. వందకు వెయ్యి… వెయ్యికి పదివేలు అనే బుకీల మాయ మాటలకు ప్రలోభ పడి అప్పుల పాలవుతున్నారు. స్నేహితులు, వడ్డీ వ్యాపారస్తులు, ఆన్‌లైన్‌ యాప్‌ల్లో అప్పులు తీసుకుని బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఉదంతాలున్నాయి. ఖమ్మంలోని కమాన్‌బజార్‌, కస్బాబజార్‌లోని పలు దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్‌ గర్స్ల్‌, కొత్తగూడెం, ఇల్లెందు సింగరేణి పారిశ్రామిక ప్రాంతాల్లోని మహిళలు కొందరు బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు పోలీసు వర్గాల సమాచారం.

గల్లీ నుంచి ఢిల్లీకి పాకిన దందా…
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్‌గా పేరొందిన ఐపీఎల్‌… ఆటగాళ్లకు, ప్రాంఛైజీలకు కాసుల వర్షం కురిపిస్తుండగా క్రికెట్‌ను ఆరాధించే యువత పాలిట శాపంగా మారింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇది పాకింది. ఎక్కడో ముంబై, ఢిల్లీ, పుణెలాంటి రాష్ట్రాల్లో కూర్చుని మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారితో ఫోన్‌లో సంభాషిస్తూ రూ. కోట్లలో గుట్టు చప్పుడు కాకుండా ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్ల ద్వారా బుకీలు కాజేస్తున్నారు. బెట్టింగ్‌ ద్వారా బుకీలు దోచుకోవడం తప్ప ఒక్కరూ సంపాదించింది లేదు.

యాప్‌లను నియంత్రించలేం..
ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌ ఏదైనా నిఘా పెడుతున్నాం. మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటున్నాం. అయితే బెట్టింగ్‌ యాప్‌లపై పోలీసు నియంత్రణ ఏమీ ఉండదు. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా పరిధిలో ఇవి ఉంటాయి కాబట్టి మేము ఏమీ చేయలేం.
– వై.వెంకటేశ్వర్లు, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ, ఖమ్మం

Spread the love