– బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా
– చేవెళ్లలో ప్రజా సంకల్ప సభ
నవతెలంగాణ-చేవెళ్ల
తెలంగాణలో అవినీతి పాలన రాజ్యమేలుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆరోపించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కేవీఆర్ గ్రౌండ్‌లో బీజేపీ సకలజనుల సంకల్ప సభ నిర్వహించింది. ఈ సమావేశానికి నడ్డా హాజరై మాట్లాడారు. ఈ తొమ్మిదేండ్ల్లలో మోడీ ప్రభుత్వం తెలంగాణలో రూ.5 లక్షల కోట్ల నిధులు ఖర్చు పెట్టిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే ఉజ్వల వినియోగదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు ఇస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమందికి రెండు పడక గదులు ఇచ్చిందో చెప్పాలన్నారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి బీసీ వ్యక్తిని సీఎంగా చేస్తామని ప్రటించినట్టు తెలిపారు. తమను గెలిపిస్తే వరికి మద్దతు ధర కల్పిస్తామని, ఎరువుల కోసం ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. మహిళా సంఘాలకు రూపాయి వడ్డీకే రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు బీజేపీకి, కుటుంబ పార్టీలకు మధ్య జరుగుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో లాగానే తెలంగాణలో కూడా బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుందని అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే, కేసీఆర్ ఆ ప్రయోజనం ప్రజలకు అందకుండా చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు ఏటీఎంల మారిందని అన్నారు. మియాపూర్‌లో కోట్ల భూ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సర్కారు భూములను అమ్మి అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. దళిత బంధు ఇచ్చి ఎమ్మెల్యేలు మొత్తం 30శాతం కమీషన్ తీసుకున్నారన్నారు. ఈ 30శాతం కమీషన్ ప్రభుత్వాన్ని ఈ నెల 30న సాగనంపాలన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. అక్కడ ఏ పథకాలు అమలు కావడం లేదని తెలిపారు. అక్కడ ఇచ్చిన ఒక్క గ్యారంటీని అమలు చేయలేదని, ఇక్కడ కూడా ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఆ పార్టీ చెబుతుందని, వాటిని నమ్మవద్దని తెలిపారు. సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, సదానందరెడ్డి, కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, కో-కన్వీనర్ రమేష్, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్‌గౌడ్, పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, కంజర్ల ప్రకాష్, చేవెళ్ల, వికారాబాద్, పరిగి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థులు కేఎస్ రత్నం, నవీన్ కుమార్, మారుతీ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.