కాచిగూడ ఐనాక్స్ లో ‘కల్కి’ షో రద్దు..

– వీక్షకుల ఆందోళన..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
కాచిగూడ చౌరస్తాలోని ఐనాక్స్ థియేటర్లో గురువారం విడుదలైన ‘కల్కి’ సినిమాకు సంబంధించి ఓ షోను రద్దు చేయడంతో వివాదం తలెత్తింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా రద్దు చేస్తారని నిర్వాహకులను నిలదీయడంతో వాగ్వాదం జరిగింది. గురువారం విడుదైన కల్కి సినిమా వీక్షించేందుకు రూ.220తో ఆన్ లైన్లో మధ్యాహ్నం 3.50 గంటల షోకు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వీక్షకులు ఐనాక్స్ కు చేరుకోగా ప్రొజెక్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో షోను రద్దు చేశామని, టికెట్ డబ్బులు 48 గంటల్లో తిరిగి చెస్తామని సిబ్బంది చెప్పారు. మేనేజర్ శేఖర్ వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 3.50 గంటలకు షో రద్దు చేసిన తెరపై 3.55 గంటలకు రూ.440 టికెట్ ధరతో షోప్రదర్శించారు. విషయం తెలుసుకున్న వీక్షకులు ప్రొజెక్టర్ లోపంతో రద్దు చేశామని చెప్పి.. అయిదు నిముషాల్లోనే అదే తెరపై షో ఎలా ప్రదర్శిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక డబ్బుల కోసం తమ షో రద్దు చేశారని ఆరోపించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డబ్బులైనా ఇవ్వండి లేదా సినిమా చూసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ మేనేజరును చుట్టుముట్టారు. సుల్తాన్ బజార్ ఎస్సై కిరణ్ కుమార్ రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అటు ఐనాక్స్ నిర్వాహకులు, ఇటు వీక్షకులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. డబ్బులు తిరిగి చెల్లిస్తామని, కోరుకున్న వారికి నగరంలో ఉన్న మిగతా ఐనాక్స్ థియేటర్లలో సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Spread the love