సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత పిటిషన్..

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. శుక్రవారం లేదా శనివారం ఢిల్లీలోని తమ కార్యలయంలో తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లను రద్దు చేయాలంటూ సుప్రీంలో పిటిషన్ వేశారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలను జారీ చేయాలని కోరారు. కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరపనుంది.  లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి. సమన్లు అందిన నేపథ్యంలో కవిత మాట్లాడుతూ… ఏం చేయాలనే దానిపై తన న్యాయబృందం స్పందిస్తుందని చెప్పారు. రాజకీయ కక్షతోనే తనకు నోటీసులు పంపారని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న ఎన్నికల వాతావరణం నేపథ్యంలోనే మళ్లీ తనను టార్గెట్ చేశారని చెప్పారు. మరోవైపు కాసేపట్లో ప్రగతి భవన్ కు కవిత వెళ్లనున్నారు. తన తండ్రి, సీఎం కేసీఆర్ ను కలవనున్నారు.

Spread the love