ఎస్ఎస్ఎల్వి క్రియేషన్స్ పతాకంపై ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుత రావు ఒకేసారి ఎనిమిది సినిమాల నిర్మాణం చేపట్టడం తెలిసిందే. ఆయన కుమారుడు ఉపేంద్ర బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’ మంచి విజయం సాధించింది. కంచర్ల ఉపేంద్ర బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కంచర్ల’. విశాఖ, అరకులో గల మడగడ వ్యూ పాయింట్ వద్ద జరిపిన చిత్రీకరణతో సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, ‘మా ఇంటి పేరు ‘కంచర్ల’ టైటిల్‌తో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో కూడా స్థానిక కళాకారులకు అవకాశం ఇచ్చాం. ఇందులో హీరో ఉపేంద్ర, హీరోయిన్లు మీనాక్షి, ప్రణతి అద్భుతంగా నటించారు. పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆర్‌ఆర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చూసేలా మంచి కంటెంట్‌తో సినిమా నిర్మించాం. డైరెక్టర్ యాద్ కుమార్ ఈ సినిమాతో విమర్శకులకు గట్టిగా సమాధానం చెబుతారు. గుణశేఖర్ ఫోటోగ్రఫీ, రాజ్ కష్ణ కొరియోగ్రఫీ, మధుబాబు కథ, మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆగస్టు 15 తరువాత సినిమా విడుదల చేస్తాం’ అని తెలిపారు. ‘అద్భుతమైన కథతో మా వంశం ఇంటి పేరు ‘కంచర్ల’ టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంటుంది’ అని హీరో ఉపేంద్ర చెప్పారు. హీరోయిన్ మీనాక్షి మాట్లాడుతూ, ‘ఇందులో నా పాత్ర అందర్నీ అలరిస్తుంది’ అని తెలిపారు. ‘నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా మంచి సందేశం ఉంటుంది. నిర్మాత అచ్యుత రావు కుటుంబం భూముల దానం నేపథ్యంలో రాసుకున్న కథతో సినిమా తెరకెక్కించాం’ అని డైరెక్టర్ యాద్ కుమార్ తెలిపారు.