కన్నడనాట కాంగ్రెస్‌ ప్రభుత్వం

– సీఎంగా సిద్ధరామయ్య
– డిప్యూటీ సీఎంగా శివకుమార్‌
– మరో 8 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
– హాజరైన ప్రతిపక్ష అతిరథ మహారథులు

 

కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, డి.కే శివకుమార్‌ను ఉపముఖ్యమంత్రిగా అతిరథ మహారధుల సమక్షంలో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు మరో 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గేకు మంత్రి పదవి దక్కడం విశేషం. అట్టహాసంగా సాగిన ప్రమాణాస్వీకార మహౌత్సవానికి బీజేపీయేతర పార్టీలు ,
లౌకిక ప్రజాతంత్ర నాయకులు హాజరవ్వడం విపక్షాల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.
బెంగళూరు : కర్నాటక 24వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఉప ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు ఎనిమిది మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలతో గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌ క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉత్సాహ పూరితంగా జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, పలువురు జాతీయ ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో జి పరమేశ్వర్‌, కెహెచ్‌ మునియప్ప, కేజే జార్జ్‌, ప్రియాంక్‌ ఖర్గే, సతీష్‌ జర్కిహోలీ, రామలింగా రెడ్డి, బీజడ్‌ జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎంబీ పాటిల్‌ ఉన్నారు. పలువురు సీనియర్‌ నేతలు మంత్రి పదవులను ఆశించినప్పటికీ అనేక దఫాల చర్చల అనంతరం కాంగ్రెస్‌ నాయకత్వం ఈ ఎనిమిది మందిని ఖరారు చేసింది.
ఇది ప్రజా విజయం సిద్ధరామయ్య

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్య మంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించారని, కాంగ్రెస్‌ విజయం ప్రజా విజయమని అన్నారు. మార్పును కోరుకున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీలను క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నింటినీ రాబోయే ఐదేళ్లలో అమలు చేస్తామని అన్నారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సిద్ధరామయ్యను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆలింగనం చేసుకుని అభినందించారు.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రముఖులు

అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌, సీపీఐ (ఎం) నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి రాజా, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తి, సీపీఐ నేత డీ రాజా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, తమిళ నటుడు కమల్‌ హసన్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌లతోపాటు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు అశోక్‌గెహ్లాట్‌, భపేశ్‌ భాగేల్‌, సుఖ్వీందర్‌సింగ్‌ సుఖు తదితరులు హాజరయ్యారు.

ఇది విద్వేషంపై విజయం : రాహుల్‌
కాంగ్రెస్‌ పార్టీ అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తుందని ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం రాహుల్‌ గాంధీ చెప్పారు. ‘మేం 5 వాగ్దానాలు చేశాం.. 2 గంటల్లో అమలు చేస్తాం. నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులకు బాసటగా నిలవడం వల్లే కాంగ్రెస్‌ గెలుపు సాకారమైంది. కర్నాటకలో విద్వేష మార్కెట్‌లు మూతబడి.. లక్షలాది ప్రేమ దుకాణాలు తెరుచుకున్నాయి. కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎలా గెలుపొందింది అని చాలా విషయాలు రాశారు. భిన్నమైన విశ్లేషణలు జరిగాయి.. పేదలు, దళితులు, ఆదివాసీలకు వెన్నంటే ఉన్నందున కాంగ్రెస్‌ గెలిచింది’ అని రాహుల్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకు 5 ప్రధాన హామీలు ఇచ్చిందని రాహుల్‌ గుర్తు చేశారు. ‘మేము ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వం. ఏది చెప్పామో అదే చేస్తాం. మరో ఒకటి రెండు గంటల్లోనే క్యాబినెట్‌ తొలి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే ప్రజలకు ఇచ్చిన 5 హామీలకు చట్టబద్ధత కల్పిస్తాం’ అని తెలిపారు. డబ్బు, అధికారం, పోలీసుల అండ ఉన్న బీజేపీని ప్రజలు ఓడించారని తెలిపారు.

 

Spread the love