నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడిగా గురువారం ఎన్నికయ్యారు. ఎస్‌సీబీఏ అధ్యక్ష పదవికి సిబల్ మే 8న అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా గురువారం ఎన్నికలు జరిగాయి. తన ప్రత్యర్థి ప్రదీప్ రాయ్‌ని ఆయన ఓడించారు. కపిల్ సిబల్‌కి 1066 ఓట్లు పడగా ప్రదీప్ రాయ్‌కి 689 ఓట్లు పడ్డాయి. ఇప్పటివరకు ఎస్‌సీబీఏ అధ్యక్షుడిగా కొనసాగిన ఆదీశ్ అగర్వాల్‌కు 296 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో కపిల్ సిబల్ విజేతగా నిలిచారు. కపిల్ సిబల్ విజయంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఉదారవాద, లౌకిక, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులకు ఇది భారీ విజయమని ఆయన వ్యాఖ్యానించారు. పదవి నుంచి దిగిపోబోతున్న ప్రధానమంత్రికి ఇది ట్రైలర్ మాత్రమేనని, త్వరలో జాతీయ స్థాయిలో మార్పు జరగనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.