నవతెలంగాణ-హైదరాబాద్ : దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. కన్నడ కస్తూరి ఎవరికి దక్కనుందే త్వరలోనే తేలనుంది. ఈ ఫలితాల కోసం బీజేపీ, కాంగ్రెస్, స్థానిక పార్టీలతో పాటు యావత్ దేశం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో రేపు జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నకల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. కన్నడనాడి ఎవరు సరిగ్గా పట్టుకున్నారో రేపు తేలనుంది. అయితే సంప్రదాయం ప్రకారం కర్ణాటక అధికారం చేతులు మారుతుందా? లేదా చరిత్ర సృష్టిస్తూ బీజేపీనే అధికారంలో కొనసాగుతుందా? లేదా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? వీటిన్నంటికి సమాధానాలు మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం వరకు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.