కారు దే గెలుపు బాట.. ఆర్మూర్ బీఆర్ఎస్ కంచుకోట..

– ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి
నవతెలంగాణ ఆర్మూర్:
కారు దే గెలుపు బాట ఆర్మూర్ బీఆర్ఎస్ కు కంచుకోట అని, మళ్లీ ‘కారు’ దే గెలుపుబాట అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఆ పార్టీ  జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం  పట్టణంలోని 15,16,17,20,22వ వార్డుల్లో  పెద్ద ఎత్తున ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ నిర్వహించారు. జీవన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి మళ్లీ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని  కోరుతూ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు పట్టణ  ప్రజలు అడుగడుగునా బ్రహ్మ రథం పట్టారు. డప్పు,వాయిద్యాలు,మేళ తాళ్లాలతో ప్రజలు మంగళ హారతులు పట్టారు. మహిళలు బోనాలతో, యువకులు బైక్ ర్యాలీలతో కేరింతలు కొడుతూ తమ అభిమాన నేతకు ఘనంగా స్వాగతం పూలవాన కురిపించారు.  జై జీవనన్న, జై కేసీఆర్ నినాదాలతో ఆర్మూర్ వార్డులన్నీ దద్దరిల్లాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రజాశీర్వాద బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ఆయా వార్డుల  ప్రగతి నివేదికలను ప్రజల ముందు ఉంచి ఇంత అభివృద్ధి సాధించిన తనను మరోమారు దీవించాలని అర్ధించారు.  ఇది ఎవరూ ఊహించని అభివృద్ధి. పదేళ్ల క్రితం ఆర్మూర్ టౌన్ ఎట్లుంది?.నేడు ఎట్లయింది?.2014కు ముందు అర్మూర్ అభివృద్ధికి నోచుకోని అంధకారబంధురం. మన ప్రభుత్వం వచ్చిన తరువాత నేడు అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తున్న అభివృద్ధి మందిరం. అన్ని వార్డుల్లో  రోడ్లు వేశాం. ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్లు సరఫరా చేస్తున్నాం. 11బైపాస్ రోడ్లు ఆర్మూర్ కీర్తికిరీటాలు. అన్ని సామాజిక వర్గాలకు ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేయించా. ఆర్మూర్  వందపడకల దవాఖాన సాధన నాకు తృప్తినిచ్చింది అని అన్నారు. ఆర్మూర్ పట్టణమంతా రోడ్లు తళతళలాడుతున్నాయి. ఆధునిక డ్రైనేజీలొచ్చాయి. పరిశుభ్రత, పచ్చదనంతో పట్టణం లో  కొత్త అందాలు ఉట్టిపడుతున్నాయి.  పెర్కిట్ చెరువు, రెడ్డిచెరువుల్లో  కాలుష్యానివారణ పనులు,  మోడ్రన్ ధోబీఘాట్, గుండ్లచెరువు టూరిజం అభివృద్ధి పనులు, వెజ్-నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పనులు,  కోట్లాది రూపాయల వ్యయంతో ఆర్మూర్ పట్టణంలో సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు,  అంబేద్కర్ చౌరస్తా సుందరీకరణ, డివైడర్లు,నిర్మాణం వంటి కార్యక్రమాలు అవధులు లేని అభివృద్ధికి అద్దం పడుతున్నాయి. నాడు మంచి నీళ్ల కోసం కొట్టుకు చస్తే నేడు ఇంటింటికీ నీటి సరఫరా జరుగుతోంది. నాడు కాలుష్యంతో విలవిలలాడిన ఆర్మూర్ నేడు పచ్చదనంతో కళకళలాడుతోంది.
ఈ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోదాం. నన్నే మళ్లీ గెలిపించాలన్నది ప్రజల ఆకాంక్ష. ఆర్మూర్ నియోజకవర్గంలోకి  కాంగ్రెస్, బీజేపీ అరాచక శక్తులకు, అభివృద్ధి నిరోధకులకు ప్రవేశం లేదు. ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ కు వ్యతిరేకంగా, కేసీఆర్ గారిచ్చే 24గంటల ఉచిత విద్యుత్ కు మద్దతుగా ఓటెయ్యాలి. పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేసే కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్  పథకాలు మనకు కావాలి. ఈ పథకాలను రద్దు చేయాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ లనే మన ఓటు ద్వారా తరిమికొడదాం. ఆర్మూర్ అభివృద్ధి మరింత వేగంగా పరుగులు పెట్టాలంటే మనం కారు గుర్తుకు ఓటేద్దాం. తెలంగాణ కు ఎలాంటి కష్టం రావద్దంటే ఊరూ వాడ ఏకమై మూడోసారి కూడా ” కారు, సారు, కేసీఆర్” అని కదం తొక్కాలి అని జీవన్ రెడ్డి అన్నారు. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు, వికలాంగుల పెన్షన్లు రూ.6వేలకు, రైతు బంధు నిధులు ఎకరాకు రూ.10వేల నుంచి రూ.16వేలకు పెరుగుతాయి. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. 3వేల భృతి వస్తుంది. రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా జరుగుతుంది. రూ.5లక్షల చొప్పున ఇంటింటికి బీమా కేసీఆర్ ధీమా పథకం అమలు కానుంది. కేసీఆర్ పాలనలోనే మనకు న్యాయం జరుగుతుంది. ఆర్మూర్ టౌన్ అభివృద్ధికి మరింత శ్రమిస్తా. నేను మీరు పెంచుకున్న బిడ్డను.
మీ కడుపులో తలపెట్టి అడుగుతున్న..నన్ను మళ్లీ దీవించండి అని జీవన్ రెడ్డి అర్ధించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు ,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు..
Spread the love