– మనీశ్ సిసోడియా కాకపోతే క్యూలో ఎవరన్న దానిపై చర్చ
న్యూఢిల్లీ: బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేజ్రీవాల్ సీఎం కుర్చీ దిగితే.. చీపురు పార్టీలో నెక్ట్స్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..? ఆప్ అధినేత ఎవరిని ఆ కుర్చీలో కూర్చోబెడతారనే చర్చ కూడా మొదలైంది. ‘రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తాను’ అని కేజ్రీవాల్ ప్రకటించారు. నేను నిజాయితీపరుడని ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు సీఎం కుర్చీలో కూర్చోను అని చెప్పడంతో పాటు, ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు తామెవరమూ ఏ పదవిని తీసుకోబోమని మనీశ్ సిసోడియా తరఫున ఆయన అన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన చేశాక.. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కాగానే సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ సాగుతోంది. ఈ ప్రశ్నకు సమాధానంగా, ప్రస్తుతం నాలుగు పేర్లు వెలువడుతున్నాయి, దానిపై చాలా ఊహాగానా లున్నాయి. ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అతిశిపై కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకం ఉన్నది. ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వపరమైన కార్యక్రమాల నిర్వహణా బాధ్యతలను ఆమెకు అప్పగించారు. అతిశితో పాటు రెండో స్థానంలో సీఎం కేజ్రీవాల్ భార్య సునీత పేరు కూడా వినిపిస్తున్నది. ఇటీవల పార్టీ పరమైన కార్య క్రమాలను భుజాలపై వేసుకుంటున్న తీరుతో సునీత పేరు సైతం పరిశీలనలో ఉన్నది. సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రారు కూడా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
అతిశి, ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రి
కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తే, ఈ పదవిలో అతిశి అయితే పాలన సమర్థవంతంగా ఉంటుందని బలమైన వాదన ఉంది. ఆమె అరవింద్ కేజ్రీవాల్‌కు విశ్వసనీయురాలు. కీలకమైన మంత్రిత్వ శాఖలకూ బాధ్యత వహిస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా రాజీనామా తర్వాత విద్యాశాఖ బాధ్యతలు ఆమెకు దక్కాయి. నీటి శాఖను సైతం ఆమె నిర్వహిస్తున్నారు. పీడబ్ల్యూడీ, రెవెన్యూ, ప్లానింగ్, ఫైనాన్స్ విభాగాలనూ చూసుకుంటున్నారు.
అతిశి పేరు ఎందుకు చర్చనీయాంశమైంది?
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేయడానికి ఇటీవలే, కేజ్రీవాల్ జైలు నుంచి ఆమె పేరును సిఫారసు చేసి, ఎల్‌జీకి లేఖ రాశారు. అతిశిపై ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నాయకత్వానికి ఎంత నమ్మకం ఉందంటే మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా నివసించే ఇల్లు అతిషి పేరు మీద ఉంది. అతిశి సీఎం అయితే ఢిల్లీకి మూడో మహిళా సీఎం అవుతుంది. ఇంతకు ముందు షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ ఢిల్లీ సీఎంలుగా ఉన్నారు.
సీఎం చేస్తారన్న ఊహాగానాలపై అతిశి ఏమన్నారు?
సీఎం చేస్తారన్న ఊహాగానాలపై అతిశి మాట్లాడుతూ, ‘సీఎం కావాల్సిన అవసరం లేదు, ఢిల్లీ అభివృద్ధి అవసరం’ అన్నారు. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనపై మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదన్నారు. సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు తమ నాయకుడు నిజాయితీపరుడో కాదో ప్రజలే నిర్ణయించుకోవాలి.
సునీతా కేజ్రీవాల్, సీఎం కేజ్రీవాల్ భార్య
అతిశి తర్వాత వినిపిస్తున్న రెండో పేరు అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్. అయితే ఆమెకు ఎమ్మెల్యే పదవి కానీ, మంత్రిపదవి కానీ లేవు కాబట్టి ఆమెను సీఎం చేయడం కాస్త కష్టమే. అయినా సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు సునీతా కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటకు వచ్చి ఢిల్లీ ప్రజల మధ్యకు వెళ్లారు. పలు ర్యాలీల్లో కూడా ప్రసంగించారు. అయితే, సునీతా కేజ్రీవాల్‌ను సీఎం చేస్తే, కేజ్రీవాల్ బంధుప్రీతి ఆరోపణలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అది ఎన్నికల వాతావరణంపై ప్రభావం చూపుతుందనే వాదన వినిపిస్తోంది.
సౌరభ్ భరద్వాజ్, ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
సీఎం రేసులో తర్వాతి పేరు సౌరభ్ భరద్వాజ్. పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్లినప్పటి నుంచి, అతిశితో పాటు, ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా పార్టీని ప్రముఖంగా నిర్వహించడంలో ముందు స్థానంలో ఉన్నారు. సౌరభ్ భరద్వాజ్ యువకుడే కాకుండా ఢిల్లీ ప్రభుత్వంలో విజిలెన్స్, హెల్త్, అర్బన్ డెవలప్‌మెంట్ సహా అనేక ముఖ్యమైన విభాగాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పేరు సీఎం పదవి అందుకోగలిగిన వారి పేర్లలో బలంగానే కనిపిస్తోంది.
కేజ్రీవాల్ రాజీనామాపై సౌరభ్ భరద్వాజ్ ఏమన్నారు?
సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ.. బెయిల్ తెచ్చుకుని కుర్చీని తన్నిన సీఎం భారతదేశంలోనే ఉండబోరని తెలిపారు. అందుకే అందరి చూపు సీఎం కుర్చీపైనే ఉందని,వీలైనంత త్వరగా ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నందున, ఈ సమయంలో ఆప్ అధినేత ప్రజల వద్దకు వెళ్తారని, అప్పుడు జనం తమకు అండగా నిలుస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఢిల్లీలో ఆప్ సీనియర్ నేత గోపాల్ రారు
సీఎం పదవి రేసులో చివరి పేరు గోపాల్ రారు. సీనియారిటీ ఆధారంగా గోపాల్ రారుకు ఛాన్స్ ఉన్నా.. ఆయన ఆరోగ్యం అంతగా సహకరించదన్న చర్చ నడుస్తోంది. అయితే చాలా సందర్భాల్లో పార్టీకి ట్రబుల్ షూటర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యావరణ మంత్రిగా ఉన్నారు.కేజ్రీవాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు అటు ప్రతిపక్షాల్లోనూ.. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలోనూ కలకలం రేపుతున్నాయి. హర్యానా ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం పదవికి రాజీనామా అంటూ కేజ్రీవాల్ చేసిన పబ్లిక్ స్టంట్ అంటూ బీజేపీ, కాంగ్రెస్ ప్రకటనలు చేశాయి. మరోవైపు ఆప్‌లో సీఎం కుర్చీ ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ పార్టీ వర్గాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది.
అంత సులువేం కాదు
– బెయిల్ షరతుల కారణంగా పెరిగిన ఇబ్బందులు
కొత్త ముఖ్యమంత్రి ముందు అనేక సవాళ్లు
ముందుగా కేజ్రీవాల్ రాజీనామా, రాబోయే ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని పునరుజ్జీవింపజేయడానికి ఉద్దేశించిన వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టడం ద్వారా, బహుశా కేజ్రీవాల్ తనను తాను ‘అవినీతి వ్యవస్థపై పోరాడుతున్న అమరవీరుడు’గా చూపించాలనుకుంటున్నారు. ఢిల్లీ ప్రజల కొత్త ఆదేశంతోనే తాను మళ్లీ సీఎం పదవికి వస్తానని ఆయన చెప్పడం ఈ సిద్ధాంతానికి మరింత బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర , జార్ఖండ్‌లతో పాటు నవంబర్‌లో ఎన్నికలు జరిగితే, ఇది ప్రజల మద్దతును కూడగట్టుకుని ఆప్‌కి ఓట్లుగా మారుతుందని ఆ పార్టీ అధినేత అంచనా.
ఆప్ ముందు ఎన్నో పెద్ద సవాళ్లు
అయితే, ఇది కనిపించినంత సులభం కాదు. ఆప్ ఇప్పుడు చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్టీ సభ్యుల గౌరవం , విధేయతను గౌరవించే ఓటర్లను ఆకర్షించే తాత్కాలిక ముఖ్యమంత్రిని కనుగొనడం సవాల్‌గా మారనున్నది. ఆప్‌లో ఉన్న అస్థిరతను సద్వినియోగం చేసుకోవడానికి ప్రతిపక్షాలు కూడా దీనిని ఒక అవకాశంగా భావించవచ్చు. ఇది కాకుండా అవినీతికి సంబంధించిన అంశం కూడా ఉంది. బెయిల్‌పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామాతో సానుభూతి పొందేం దుకు లేదా జైలు తర్వాత కొత్త ఆదేశాన్ని పొందేందుకు రాజకీయ ఎత్తుగడ మాత్రమే కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు కేజ్రీవాల్‌కు పరిపాలనాపరమైన అడ్డంకిని సృష్టించింది. బెయిల్ షరతులు ఆయనను కార్యాలయానికి వెళ్లకుండా లేదా ప్రభుత్వ ఫైళ్లపై సంతకం చేయకుండా నిరోధించాయి. ఇప్పుడు కేజ్రీవాల్‌కు పాలన దాదాపు అసాధ్యంగా మారింది. అటువంటి పరిస్థితులలో పట్టుదల అతని పార్టీ విధానాలను అమలు చేసే సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది, చివరికి ఆప్ ఎన్నికల అవకాశాలను దెబ్బతీస్తుంది.
రాజీనామా చేసి నష్ట నివారణ
కేజ్రీవాల్‌తో ముడిపడిఉన్న మరో ముఖ్యమైన అంశం రాష్ట్రపతి పాలన ముప్పు. రాష్ట్రపతి పాలనను సమర్థించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులను ఉదహరించి ఉండవచ్చు, ఇది ఎన్నికలను ఆరు నెలల వరకు ఆలస్యం చేసే అవకాశం ఉంది. దీంతో జైలు నుంచి విడుదలైన తర్వాత కేజ్రీవాల్‌కు లభించిన సానుభూతిని దెబ్బతీస్తుంది, ఎన్నికల సమయంలో ప్రజల సానుభూతిని పొందడం మరింత సవాలుగా మారుతుంది. రాజీనామా చేయడం ద్వారా కేజ్రీవాల్ ఈ పరిపాలనా, రాజకీయ ప్రతికూలతల నుంచి తప్పించుకున్నారనే చర్చ నడుస్తోంది.