కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం

Kavita cannot be granted interim bail– ఈడీ, సీబీఐకి సుప్రీం నోటీసులు
– 20కి విచారణ వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టై తీహార్‌ జైల్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పుడే మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ వాదనల తరువాత ఈ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ స్కాంకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ కోరుతూ ఈనెల 8న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ సోమవారం జసటిస్‌ బిఆర్‌. గవారు, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మానం విచారించింది. కవిత తరఫు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహిత్గీ, విక్రమ్‌ చౌదరీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్గీ వాదనలు వినిపిస్తూ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన కవిత గత ఐదు నెలలుగా తీహార్‌ జైల్‌లోనే ఉన్నారని, ఆమె బెయిల్‌కు అర్హురాలని కోర్టుకు నివేదించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం సిోడియాలు వరుసగా మధ్యంతర, సాధారణ బెయిల్‌ పొందిన కేసులకు సంబంధించిన అంశమని ధర్మాసనానికి వివరించారు. సెక్షన్‌ 45 కింద మహిళ అయిన కవిత బెయిల్‌ ఇవ్వాలని కోరారు.
ఈ వాదనలపై జస్టిస్‌ బిఆర్‌ గవాయి స్పందిస్తూ ‘కవిత బాగా చదువుకున్న మహిళ, రాజకీయ వేత్త.’ అని అన్నారు. ఇందుకు రోహిత్గీ బదులిస్తూ… కవిత మాజీ పార్లమెంటేరియన్‌ అయిన మహిళ అని వాదించారు. ఈ వాదనలపై మరోసారి జోక్యం చేసుకున్న ధర్మాసనం… కవిత సాధారణ మహిళ కాదని హైకోర్టు పేర్కొన్న అంశాన్ని గుర్తు చేశారు. ఈ పిటిషన్‌ పై దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీకి నోటీసులు జారీ చేస్తున్నట్టు వెల్లడించారు. అప్పటి వరకు కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని రోహిత్గీ కోరగా దర్యాప్తు సంస్థల వాదనల తరువాతే నిర్ణయం వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.

Spread the love