– కులగణనను అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్‌ను బీసీ సంఘాలు నిలదీయాలి
– అందుకే ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం
– ధర్నాచౌక్‌ను ఎత్తేసినోళ్లు ధర్నాలకు దిగడం విడ్డూరం : మీడియా ప్రతినిధులతో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేసుల నుంచి తప్పించుకునేందుకు మహారాష్ట్రంలో బీజేపీకి బీటీమ్‌గా కేసీఆర్ అండ్ కో పనిచేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కుల గణన కోసం వచ్చే అధికారులను నిలదీయాలని కేటీఆర్ పిలుపు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కులగణనను అడ్డుకునేలా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్‌ను బీసీ, కుల సంఘాలు నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. కుల గణనను అడ్డుకుంటే బీఆర్‌ఎస్ బీసీ ద్రోహిగా మిగలటం ఖాయమని హెచ్చరించారు. సామాజిక తరగతుల వారిగా జనాభా లెక్క తేలితేనే సంక్షేమ వాటా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సర్వేను బహిష్కరించడమంటే తమ హక్కులను, అభివృద్దిని వదులుకోవడమే అవుతుందని చెప్పారు. క్లబ్బులు, పబ్బులు బంద్ అయ్యాక కొందరు నేతలు అరాచకంగా తయారయ్యారనీ, విజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక్క కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవ్వరికీ లబ్ది చేకూరకూడదనే ఉద్దేశంతోనే ఇంటింటి సర్వేను బీఆర్‌ఎస్ అడ్డుకుంటున్నదని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణంపై తప్పుడు ప్రచారం చేస్తూ ఆటో డ్రైవర్లను ఉసిగొల్పడాన్ని తప్పుబట్టారు. ఓలా, ఊబర్ క్యాబ్లు, బైక్ టాక్సీలకు ప్రగతి భవన్‌లో పచ్చా జెండాలు ఊపి ప్రారంబించినప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తుకు రాలేదా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. గత ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోవడంతో ఎంతో మంది రైతులను బ్యాంకులు బ్లాక్ లిస్టులో చేర్చడం, పలు సాంకేతిక సమస్యల కారణంగా మిగిలిన రైతులకు రుణ మాఫీ ఆలస్యమవుతోందన్నారు. రుణమాఫీని బరాబర్ చేసితీరుతామన్నారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ అందిస్తున్నట్టు చెప్పారు. ఒక్కో గ్యారంటీని నెరవేర్చుకుంటూ పోతామని స్పష్టం చేశారు. గూడు లేని పేదలకు రూ. 5 లక్షలతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన రూ. 7 లక్షల కోట్ల అప్పులకు ఇప్పటికే రూ. 54 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ ఎన్నో హమీలిచ్చి మోసం చేసిందని గుర్తు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ టిల్లుగా వ్యవహరిస్తున్నారనీ, వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెడుతూ మాజీ మంత్రి హరీష్ రావు గౌరవం పొగొట్టుకుంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో తాలు, తరుగు పేరుతో రైతులను నిండా ముంచిన మిల్లర్ల పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తుంటే…మిల్లర్లతో కుమ్మక్కైన బీఆర్‌ఎస్ రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో ఏనాడూ సీఎం, మంత్రులు సచివాలయానికి రాలేదని గుర్తుచేశారు.
తాము మాత్రం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో రాజకీయ పర్యటనలు చేస్తే..తాము మాత్రం రాజ్యాంగ పరిరక్షణ కోసం, కుల గణన కోసం పనిచేసే శక్తుల విజయాన్ని కాంక్షించి సొంత ఖర్చులతో ప్రచారం చేస్తున్నామని చెప్పారు. మేమేంతో మాకంత అన్న నినాదాన్ని నిజం చేసేందుకు సామాజిక విప్లవకారుడిలా రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా తమ ప్రచారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.