మీకో రహస్యం చెబుతున్నా..కేసీఆర్ వచ్చి నన్ను కలిశారు.. మోడీ సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ-హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ వచ్చి తనను కలిశారని, ఎన్డీయేలో చేరుతానని చెప్పారని ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ప్రధాని ఇందూరు గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇంతకుముందు చెప్పని రహస్యం ఇవాళ చెబుతున్నానని, కేసీఆర్ తనను కలిసి ఎన్డీయేలో చేరుతానని చెప్పారని, కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారని అన్నారు. అయితే ఇది రాజరికం కాదని, బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పానన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పానని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరఫున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఆస్పత్రులు, రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.  తెలంగాణ ప్రజల్లో ఎంతో శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయన్నారు. ప్రపంచానికి కరోనా వ్యాక్సీన్ అందించిన ఘనత హైదరాబాద్‌దే అన్నారు. ఎంతోమంది బలిదానంతో తెలంగాణ ఏర్పడిందని, కానీ ఓ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకుంటోందన్నారు. కేసీఆర్, ఆయన కొడుకు, మేనల్లుడు, కూతురు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ధనికులయ్యారని ఆరోపించారు. ఈ కుటుంబ పాలనకు తెలంగాణ యువత మరోసారి అవకాశం ఇవ్వవద్దని పిలుపునిచ్చారు.

Spread the love