రౌడీ పంచాయితీలు చేయడం మాకు వచ్చు : కేసీఆర్

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తయిందని.. ఈ 11 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థం అయిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శనివారం ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలని సూచించారు. కొందరికి లాభం చేయాలనే ఉద్దేశంతో పేదల పొట్ట కొట్టొద్దని అన్నారు. సమాజాన్ని నిలబెట్టి నిర్మాణం చేయాలని సూచించారు. కూలగొడుతామంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అని అన్నారు. ‘మాకూ మాటలు వచ్చు.. ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు మాట్లాడగలుగుతా’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
అధికారం ఉంది కదా అని ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం కరెక్ట్ కాదని అన్నారు. అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదని తెలిపారు. ప్రజలు ఒక మంచి బాధ్యత అప్పగించారని.. ముందు దానిని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను దుర్వినియోగం చేయొద్దని సూచించారు. రౌడీ పంచాయితీలు చేయడం మాకు కూడా వచ్చని అన్నారు. అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదని.. నిర్మించడానికి అని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరూత్సాహ పడొద్దని.. అందరూ కష్టపడి పనిచేయాలని కోరారు. అతి త్వరలో మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు 100 శాతం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు.

Spread the love