– ప్రారంభించిన అల్లు అర్జున్
– భారీగా తరలొచ్చిన అభిమానులు
నవతెలంగాణ-పెద్దవూర
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం బట్టుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన కేసీర్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌ను సినీహీరో అల్లు అర్జున్ శనివారం ప్రారంభించారు. అల్లు అర్జున్ మామ, కేసీఆర్ ఫౌండేషన్ చైర్మెన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి రూ.1.50 కోట్లతో కేసీఆర్ కన్వెన్షన్ ప్లేస్ ఫంక్షన్‌హాల్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12.15గంటలకు ప్రారంభించారు.
అంతకు ముందు అల్లుఅర్జున్ పెద్దవూరకు చేరుకోగానే పెద్దఎత్తున అభిమానులు బైక్‌ర్యాలీ తీశారు. అనంతరం కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్వాగత ఉపన్యాసంతో సభ ప్రారంభమైంది. అల్లు అర్జున్ అభిమానులనుద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో పెద్దఎత్తున అభిమానులు స్టేజిపైకి రావడం.. పోలీసులు అడ్డుకున్నా వినకపోవడంతో ఆయన కిందకు దిగి వాహనం ఎక్కారు. ఈ సందర్భంగా అభిమానులు పుష్ప సినిమాలో పాటకు డ్యాన్స్ వేశారు. ఈ కార్యక్రమంలో అల్లుఅర్జున్ అత్త కంచర్ల అరుణ, డాక్టర్ రఘు, ఐపీఎస్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.