కేసీఆర్ దోర రహస్యంగా బీజేపీకి పొర్లుదండాలు పెట్టాడు : షర్మిల

నవతెలంగాణ-హైదరాబాద్ : నిర్మల్ సభలో ఎక్కడా బీజేపీ మాటెత్తకుండా కేసీఆర్ చేసిన ప్రసంగంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. వాషింగ్ పౌడర్ నిర్మా కేసీఆర్ కు సైతం పనిచేసినట్టుంది… నిర్మాతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగింది… బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ బయటపడిందని విమర్శించారు. కారు-కమలం రెండూ ఒక్కటేనన్న తళతళ మెరుపు కేసీఆర్ ముఖంలో కనపడిందని వ్యంగ్యం ప్రదర్శించారు. నోరు విప్పితే బీజేపీని తిట్టే కేసీఆర్ దొర మోడీని పల్లెత్తు మాట కూడా అనడంలేదని షర్మిల వెల్లడించారు. బిడ్డ లిక్కర్ స్కాంలో దొరకగానే ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లుదండాలు పెట్టాడని విమర్శించారు. కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్ఠానం ముందు మోకరిల్లాడని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకున్న లక్ష కోట్ల గురించి అడగొద్దని బీజేపీకి సలాం కొట్టాడని షర్మిల ఆరోపించారు. అవసరానికి తగినట్టుగా వేషాలు మార్చుతూ, జనాలను పిచ్చోళ్లను చేయడమే బీజేపీ బీఆర్ఎస్ రహస్య అజెండా అని విమర్శించారు. ‘నువ్వు కొట్టినట్టు నటించు… నేను ఏడ్చినట్టు నటిస్తా… ఇన్నాళ్లపాటు బీజేపీతో కేసీఆర్ నడిపించిన దోస్తానా ఇదే. ఇంతకూ మీరు నడిపే రహస్య స్నేహం ప్రీ పోల్ ఒప్పందమా, పోస్ట్ పోల్ ఒప్పందమా? కమలం ముసుగు కప్పుకుని కారులో తిరగే కేసీఆర్ దొరా… అసలు విషయం బయటపెట్టు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడని బీజేపీ సైతం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతు తెలపడమే బీజేపీ రహస్య ఒప్పందమా? బీజేపీ అభ్యర్థులు కేసీఆర్ కు సప్లయింగ్ కంపెనీలా మారడమే సీక్రెట్ అగ్రిమెంటా? కేసీఆర్ కు సీట్లు తక్కువ పడితే ఎమ్మెల్యేలను అందించడమే తెర వెనుక ఒప్పందమా? ఏ ఒప్పందం లేకపోతే కేసీఆర్ అవినీతిపై చర్యలు ఏవి? కవిత అరెస్టుపై ఎందుకీ సాగతీత? తక్షణమే బీజేపీ నోరు విప్పాలని వైఎస్సార్టీపీ డిమాండ్ చేస్తోంది’ అని షర్మిల స్పష్టం చేశారు.

Spread the love