పాలేరు సభలో తుమ్మలపై కేసీఆర్ ఫైర్

నవతెలంగాణ పాలేరు: పాలేరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి తుమ్మ‌ల‌ నాగేశ్వ‌ర రావుపై కేసీఆర్ మండిపడ్డారు. ఖ‌మ్మంలో పువ్వాడ అజ‌య్‌పై ఓడిపోయి ఇంట్లో మూల‌న కూర్చుంటే తానే పిలిచి తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీని చేశాను. ఆ త‌ర్వాత పాలేరులో ఎమ్మెల్యే వెంక‌ట్ రెడ్డి చ‌నిపోయారు. ఆయ‌న భార్య‌ను పోటీలో పెట్టాల‌ని అనుకున్నాం. కానీ ఈయ‌న వ‌చ్చి అన్న నా నియోజ‌క‌వ‌ర్గం రిజ‌ర్వ్ అయింది. అవ‌కాశం ఇస్తే పాలేరు సేవ‌కు చేస్తా, కాపాడుకుంటాను అని చెప్తే ఉప ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చి మేమంతా వ‌చ్చి దండం పెడితే 42 వేల మెజార్టీతో గెలిపించారు. ఈ స‌త్యం మీకు తెలుసు. ఓట్లు వేసింది మీరే అని కేసీఆర్ తెలిపారు. నేను ఒక్క‌టే మాట అడుగుతున్నాను. మంత్రిని చేసి, ఎమ్మెల్సీని చేసి, ఎమ్మెల్యేను చేసి ఐదేండ్లు జిల్లా మీద ఏక‌ఛ‌త్రాధిప‌త్యం ఇస్తే నీవు చేసింది సున్నా గుండు సున్నా. ఖ‌మ్మం జిల్లాలో ఒక్క సీటు రాకుండా చేశారు. ఎవ‌రు ద్రోహం చేశారు. ఎవ‌రికి ఎవ‌రు న‌ష్టం చేశారు. బీఆర్ఎస్‌కు తుమ్మ‌ల అన్యాయం చేసిండా..? బీఆర్ఎస్ తుమ్మ‌ల‌కు అన్యాయం చేసిందా..? న్యాయం చెప్పాలింది మీరు. ఈ చ‌రిత్ర అంతా మీ కండ్ల ముందు జ‌రిగిన చ‌రిత్ర. ఇవ‌న్నీ మ‌రిచిపోలేం. ఇవాళ నోరు ఉంద‌ని అడ్డ‌గోలుగా మాట్లాడితే రాజ‌కీయం కాదు. ప్ర‌జాస్వామ్యం కాదు. అది అరాచ‌కం. అరాచకాల్ని తిప్పికొట్టాలి. అరాచ‌క రాజ‌కీయ‌వేత్త‌ల‌కు బుద్ది చెప్పాల‌ని కేసీఆర్ పాలేరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ రాక ముందు చాలా పార్టీలు పాలించినవి.. కానీ ఎవ్వరూ పాలేరును పట్టించుకోలేదు… నరంలేని నాలుకలు, కొందరు నాయకులు మాటమార్చవచ్చు కానీ నిజం మారుతుందా.. పాలేరు అభివృద్ధి కేసీఆర్ చేసింది కాదా… అవకాశాల కోసం పార్టీలు మార్చేవారు మన మద్య ఉన్నారు.. మీరు మాయలో పడకుండా ఆలోచించి ఓటు వేయండి .. డబ్బులకట్టల అహంకారంతో వచ్చేవారిని, పూటకో మాట మార్చేవారిని, పార్టీలు మార్చేవారిని ప్రజలు గెలిపిస్తే.. వారు గెలుస్తారు… ప్రజలు ఓడిపోతారు.. రైతుబందు దుబారా అంటడు మాజీ పీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మూడు గంటలు కరెంట్ చాలు అంటడు ప్రస్తుత పీసీసీ అద్యక్షుడు ఈ ఖమ్మం జిల్లాలో కొందరు బైరూపుల నాయకులు ఉన్నారు. డబ్బుల కట్టలతో గెలుస్తా అని విర్రవీగుతుండు అని అన్నారు. 13నిమిషాల  పాటు సాగిన సీఎం ప్రసంగంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, కాంగ్రెస్ ను తిట్టిపోయడానికే ఎక్కువ సమయం కేటాయించడం గమనార్హం.

Spread the love