మిత్రుడికి మోడీ ..కుటుంబానికి కేసీఆర్‌ దోచి పెడుతున్నారు

Modi for friend ..KCR for family They are robbing– బీజేపీది విభజించు పాలించు విధానం
– దేశ యువతకు రాజీవ్‌ ఒక స్ఫూర్తి
– దేశ సమగ్రతను కాపాడేందుకు పునరంకితమవుదాం
– రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రధాని మోడీ తన మిత్రులకు దోచి పెడుతుంటే… సీఎం కేసీఆర్‌ రాష్ట్ర సంపదను తన కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. బీజేపీది విభజించు, పాలించు విధానమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పి.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని పిలుపుని చ్చారు. దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్‌ గాంధీదేనన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడలోఉన్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఆయన 79వ జయంతి సందర్భంగా పార్టీ నేతలతో కలిసి రేవంత్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌ దేశానికి రాజీవ్‌ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను రాజీవ్‌ నిజం చేశారని గుర్తు చేశారు. ‘రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకే సర్వ హక్కులు, అధికారాలు కల్పించారని తెలిపారు. స్థానిక సంస్థలను బలోపేతం చేశారని, దేశంలో మహిళలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించారని వివరించారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి పేదల చేతిలో అధికారం పెట్టారని తెలిపారు. సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఆయన..’ఐటీ రంగంలోనే కాదు, టెలికాం రంగంలోనూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాజీవ్‌ గాంధీ కుటుంబమని చెప్పారు. ఆయన జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన సేవలను, ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఆయన స్పూర్తితో మళ్లీ దేశ సమగ్రతను కాపాడే ందుకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. మణిపూర్‌ మండు తున్నా.. ప్రధాని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాణానికి బొమ్మా, బొరుసులాంటివన్నారు. వారిద్దరిది ఫెవికాల్‌ బంధమని ఎద్దేవా చేశారు.
రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డికి రేవంత్‌ శుభాకాంక్షలు
కాంగ్రెస్‌ అత్యున్నత స్థాయి కమిటీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యుసీ)కి ఎంపికైన నాయకులకు రేవంత్‌ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజానర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీ చంద్‌రెడ్డికి అవకాశం ఇచ్చినందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్‌ఖర్గే, అగ్రనేత సోనియాగాంధీలకు ధన్యవాదాలు తెలిపారు.

Spread the love