– ప్రభుత్వాన్ని కూల్చుతామని రంకెలేస్తే, గాలి కొదిలేస్తామా? : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– రాహుల్ హామీ 100 శాతం పక్కా
– విద్యా శాఖకు నేను ఫుల్ టైం మంత్రిని
– నిధులకోసం ప్రధానిని కలుస్తాం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్టీ ఫిరాయింపులకు కేసీఆరే ఆద్యుడని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని రంకెలేస్తే, గాలికి వదిలేస్తామా? అని ప్రశ్నించారు. పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్‌కు వెన్నెతో పెట్టిన విద్య అని అన్నారు. అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో, అద్భుతమైన పరిపాలన ప్రజలకు అందిస్తున్నా మన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులు తెలంగాణలో లేవన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు, తమ పాలనలో ఉండవన్నారు. గురువారం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ‘వంద ఎలుకలు తిన్న పిల్లి, తీర్థయాత్రలకు పోయిందన్నట్లు’ కేసీఆర్ తీరు ఉందన్నారు. ఈ విషయంలో కేసీఆర్‌కు సిగ్గుతో పాటు మతి కూడా తప్పిందన్నారు. ఇలాంటి ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను తీసుకున్నారని ఫైర్ అయ్యారు. చేసిన తప్పులకు క్షమించమని తొలుత అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి కేసీఆర్ ముక్కు మూడించులు అరిగేలా నేలకు రాయాలన్నారు. 100 రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించదని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు చెప్పారన్నారు. దానికి వంతపాడింది బీజేపీనే కదా అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీఆర్‌ఎస్, బీజేపీ రోడ్లపై రంకెలేస్తే, గాలికి వదిలేయాలా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో 35 శాతం ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్, ఎంపీ ఎన్నికల్లో 16 శాతం ఓట్లకు పడిపోయిందన్నారు. 17 ఎంపీ స్థానాలు ఓడి, 8 సీట్లల్లో డిపాజిట్ కోల్పోయి, 14 స్థానాల్లో మూడో స్థానంలో నిలిచినా, కేసీఆర్‌కు ఇంకా కనువిప్పు కలగడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓట్లేయకపోవడం ప్రజల తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్‌ను చెప్పాలన్నారు. అదే పదేండ్లలో ప్రతిపక్ష నేతలను ఏనాడైనా సీఎం కేసీఆర్ పిలిచారా? అని ప్రశ్నించారు. ఏమాత్రమైనా ఉద్యమ నేతగా కేసీఆర్‌కు సోయి ఉండి ఉంటే, పదేండ్ల ఉత్సవాల్లో హుందాగా హాజరయ్యేవారని అన్నారు. స్వార్థం, దోపిడీ, తన కుటుంబానికే అన్ని ఉండాలనేది కేసీఆర్ కోరికని తెలిపారు. ఇవి ఎల్లకాలం వాళ్లను బతికించవని విమర్శించారు.
రాహుల్ గాంధీ హామీ 100 శాతం పక్కా
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలంగాణ ఇస్తానని 2004లో కరీంనగర్‌లో ఇచ్చిన హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని సీఎం గుర్తు చేశారు. అలాగే రాహుల్ గాంధీ హామీ ఇచ్చారంటే, అది 100 శాతం అమలవుతుందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రైతు రుణమాఫీ చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారని, అందులో భాగంగానే దాదాపు రూ.31 వేల కోట్లతో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించుకుందని అన్నారు. ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని, పాలనను గాడిలో పెట్టామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రిస్మస్, రంజాన్, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి వచ్చాయని, అయితే ఇప్పటి వరకు చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నట్లు వివరించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఏపీలో 40, 50 మంది అధికారులను బదిలీ చేస్తే, తెలంగాణ లో ఏ చిన్న బదిలీ లేదన్నారు. ఎన్నికల నిర్వహణలో బీఆర్‌ఎస్‌తో పాటు రాజకీయ ప్రత్యర్థులు కూడా తమపై ఎలాంటి ఆరోపణ చేయలేకపోయారన్నారు. వచ్చే నెల 7తో తన పీసీసీ పదవీకాలం ముగుస్తున్నందున ఆలోపే నూతన పీసీసీ అధ్యక్షడిని నియమించాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కోరినట్లు తెలిపారు
విద్యా శాఖకు నేను ఫుల్ టైం మంత్రిని
మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా తానేమి ఫాంహౌజ్‌లో పడుకొని ప్రభుత్వాన్ని నడపడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యా శాఖకు తాను ఫుల్ టైం మంత్రినని చెప్పారు. రాష్ట్రంలో ఏ శాఖ ఖాళీగా లేదని, అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారని అన్నారు. పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలోని మంత్రులు నిర్వహిస్తోన్న శాఖలు, తెలంగాణ రాష్ట్ర మంత్రుల పనితీరును పోల్చి చూడాలన్నారు. ఎవరైనా తెలంగాణ కన్నా ముందుంటే, బాగా పాలన చేస్తే చెప్పాలని సవాల్ విసిరారు. తమ లాగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం కేంద్రం మంత్రులను బీజేపీ పాలిత సీఎంలు, మంత్రులు కలవడం లేదన్నారు. బేషజాలానికి పోకుండా ప్రతి మంత్రిని కలిసి రాష్ట్రానికి సహకారం అందించాలని కోరుతున్నామన్నారు.
రాజకీయ పార్టీలు నడిపే మీడియా సంస్థలు, ఆ పార్టీల ప్రయోజనాల కోసం, పూర్తిస్థాయి మంత్రులు లేరంటూ విష ప్రచారం చేయడం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న విద్యా శాఖలో క్రీయాశీలక మంత్రిగా సమర్థవంతంగా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. టెన్త్, ఇంటర్, ఇంజినీరింగ్, నీట్ పరీక్షలు, డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉన్నామా? అని ప్రశ్నించారు. విద్యా శాఖలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా తమ పాలనలో ఎక్కడైనా లోపాలు జరిగితే చెప్పాలని సవాల్ విసిరారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంసెట్ ఫలితాలను కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. క్యాలెండర్ ఇయర్‌ను అమలు చేసేలా నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని సీఎం స్పష్టత ఇచ్చారు. కానీ, పలు మీడియా సంస్థలు, మంత్రి వర్గ విస్తరణ చర్చలు చేసి, శాఖలు కేటాయించి, ప్రమాణ స్వీకారానికి ముహుర్తాలు పెట్టారని చురకలంటించారు.
త్వరలో ప్రధానిని కలుస్తాం
కొత్త ప్రభుత్వం పెట్టే బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించేందుకు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. త్వరలోనే ప్రధాని, హౌంమంత్రిని కలవనున్నట్టు చెప్పారు. రాష్ట్రం హక్కులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని తమ ప్రభుత్వం అనుకుంటుందని తెలిపారు. ‘ఇప్పుడు పరిపాలన చేసే సమయం కాబట్టి వచ్చే బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించాలని అందరినీ కలుస్తాం. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసుకుని, కేంద్రం నుంచి నిధులు, అనుమతులు, ఏపీతో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. చంద్రబాబుతో వీలైనమేరకు సమస్యలను సానుకూలంగా పరిష్కరించు కుంటాం. కేంద్రం వల్ల కూడా కాకపోతే సమస్యల పరిషారానికి కోర్టులున్నాయి. పక్కరాష్ట్రం అభివృద్ధి చెందితే అసూయపడం. మా రాష్ట్ర అభివృద్ధికి అలసత్వం ప్రదర్శించం’ అని తేల్చి చెప్పారు.
తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేస్తున్నామని, రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. దానికోసం రాష్ట్ర పురోగతికి రోజుకు 18 గంటలు కష్టపడుతున్నట్లు చెప్పారు. విద్యుత్తు కొనుగోళ్ల మీద విచారణ కమిషన్‌ను తాము ప్రతిపాదించలేదని, జగదీశ్‌రెడ్డి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాది నిర్మాణానికి అసెంబ్లీలో విసిరిన సవాల్‌ను స్వీకరించినట్లు చెప్పారు. విచారణ కమిషన్ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను అడిగితే రిటైర్డు జడ్జిని నియమించుకోవచ్చని అన్నారని చెప్పారు. కమిషన్ ఏర్పాటు తర్వాత మూడు నెలలు దాకా టీఆర్‌ఎస్, కేసీఆర్ ఏం మాట్లాడలేదని, కేసీఆర్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని లేఖ రాగానే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విచారణ కమిషన్ వేయడం తప్పా? కేసీఆర్‌ను వివరణ ఇవ్వాలని అడిగినందుకు తప్పుపడుతున్నారా? జస్టిస్ నరసింహారెడ్డిని తప్పుపడుతున్నారా? అనేది బీఆర్‌ఎస్ నేతలు స్పష్టత ఇవ్వాలన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి లోపాలు ఏమైనా ఉంటే కేసీఆర్ విచారణకు వెళ్లి అనుభవాన్ని, అద్భుతంగా వాదించుకోవచ్చు కదా అని అన్నారు. వారు కోరుకుంటే లైవ్ టెలికాస్ట్‌కు ప్రభుత్వం కూడా కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తుందన్నారు.
గోతికాడి నక్కలకు.. అనుభవంతో రిప్లై ఇచ్చారు
దాదాపు 40 ఏండ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలకు జీవన్ రెడ్డి అండగా ఉంటూ వస్తున్నారని సీఎం అన్నారు. అయితే ప్రభుత్వం రైతులకు చేస్తోన్న రుణమాఫీ, ఆరు గ్యారెంటీల అమలు, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సంజరు కాంగ్రెస్‌లో చేరారన్నారు. ఈ జాయినింగ్ విషయంలో తమవైపు నుంచి సమన్వయం చేయడంలో లోపం, పీసీసీ నుంచి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. ఈ కారణంగా జీవన్ రెడ్డి మనస్థాపం చెందారన్నారు. ఈ గందరగోళాన్ని గుర్తించిన మంత్రి శ్రీధర్‌బాబు తక్షణమే జీవన్ రెడ్డితో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపారన్నారు. మరోవైపు తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ పట్ల జీవన్ రెడ్డికి ఉన్న కమిట్మెంట్, అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కేసీ వేణుగోపాల్, దీపా దాస్ మున్షి ఆయనతో మాట్లాడారన్నారు. అయితే జీవన్ రెడ్డి ఇష్యూతో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసేలా కొన్ని గోతికాడి నక్కలు ఎదురు చూశాయని విపక్ష పార్టీలపై ఫైర్ అయ్యారు. కానీ పార్టీ పట్ల ఉన్న చిత్తశుద్ది, అనుభవంతో అలాంటి నక్కలకు జీవన్ రెడ్డి ఛాన్స్ ఇవ్వలేదన్నారు. జీవన్‌రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా జగిత్యాల, కరీంనగర్ కు చెందిన పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారన్నారు. ఈ విషయంలో పీసీసీ ఛీప్, సీఎంగా అధిష్టానం ఆదేశాలను పాటిస్తానని స్పష్టం చేశారు. రుణమాఫీ, ప్రభుత్వ పాలనతో జీవన్ రెడ్డి అనుభవాన్ని ఉపయోగించుకుంటామన్నారు. నేతల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నా… ఆఖరుకు కాంగ్రెస్ పార్టీనే తమలో ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.