కేసీఆర్‌ మానస పుత్రిక సుంకిశాల నిర్మాణ లోపంతోనే కుప్పకూలింది

KCR Manasa Putrika Sunkishala
– నష్టాన్ని నిర్మాణ సంస్థే భరిస్తుంది..ప్రభుత్వానికి నష్టం లేదు
– బీఆర్‌ఎస్‌ హయాంలో కట్టిన మిగతా ప్రాజెక్టుల పరిస్థితీ తేలాలి : మంత్రులు ఉత్తమ్‌,తుమ్మల
– సుంకిశాలలో ప్రమాద స్థలం పరిశీలన
నవతెలంగాణ – పెద్దవూర
కేసీఆర్‌ మానస పుత్రిక సుంకిశాల ప్రాజెక్టు, దాని గురించి తండ్రీతనయు లకు, కాంట్రాక్టర్లకే తెలుసని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో సుంకిశాల ప్రాజెక్టులో కూలిన రక్షణ గోడ, గేట్లను శుక్రవారం శాసన మండలి చర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనలో ఎస్‌ఎల్బీసీ సొరంగ పనులు పూర్తి చేసి ఉంటే సుంకిశాల ప్రాజెక్టు అవసరమే ఉండేది కాదని చెప్పారు. ఏఎంఆర్పీ నుంచి హైదరాబాద్‌కు తాగునీళ్లు సక్రమంగా అందుతున్నా కమీషన్ల కోసం రూ.2,200 కోట్లు వెచ్చించారని విమర్శించారు. సుంకిశాల నిర్మాణ డిజైన్‌ చేసింది, కాంట్రాక్టుకు ఇచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. సుంకిశాల నష్టం రూ.10 నుంచి 15 కోట్లు ఉంటుందని, దాన్ని కాంట్రాక్టు సంస్థే భరిస్తుందని, ప్రభుత్వానికి ఎలాంటి నష్టమూ లేదని చెప్పారు. ఎస్‌ఎల్బీసీ సొరంగం పనులు మొత్తం 44 కిలోమీటర్లు కాగా.. ఇప్పటికి 35 కిలోమీటర్లు పూర్తి అయిందన్నారు. మరో 9 కిలోమీటర్లు పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తామని తెలిపారు.మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. సుంకిశాల ప్రాజెక్టును 2021 జులైలో నాటి కేసీఆర్‌ ప్రభుత్వం కాంట్రాక్ట్‌ సంస్థతో అగ్రిమెంట్‌ చేసుకుందన్నారు. టన్నెల్‌ సైడ్‌ వాల్‌ని జులై 2023లో పూర్తి చేశారని చెప్పారు. సుంకిశాల ప్రాజెక్టు కాంగ్రెస్‌ కట్టింది కాదు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతో పాటు సుంకిశాల కూడా బీఆర్‌ఎస్‌ పాపమే.. బీఆర్‌ఎస్‌ హయాంలో మొదలు పెట్టిన మిగిలిన నిర్మాణాల పరిస్థితి కూడా భవిష్యత్‌లో తేలుతుందని అన్నారు. కాంగ్రెస్‌ రాగానే కూలిందంటూ.. గత పాలకులు సుంకిశాల పాపాన్ని తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును అందరూ వ్యతిరేకించి నా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసమే ప్రారంభించిందని విమర్శించారు. సుంకిశాల పంప్‌హౌస్‌ ప్రాజెక్టు పనులను 2021లో రూ.2,200 కోట్లకు మేఘా సంస్థ కాంట్రాక్టు దక్కించుకోగా.. ఇప్పటి వరకు రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టారని వివరించారు. ఇన్‌టెక్‌ వెల్‌లో సంపు, పంపుహౌస్‌, 3 టన్నెళ్లు, సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మిస్తున్నారని తెలిపారు. పంపింగ్‌ మెయిన్స్‌లో 50 కిలోమీటర్ల మేర 3 వరుసల 2,325 ఎంఎం డయా పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు ఇన్‌టెక్‌ వెల్‌ పనులు ఇప్పటి వరకు 60 శాతం, పంపింగ్‌ మెయిన్‌ పనులు 70 శాతం, ఎలక్్రో మెకానికల్‌ పనులు 40 శాతం పూర్తయ్యాయన్నారు. అయితే, సాగర్‌ రిజర్వాయర్‌లోకి భారీ వరద చేరుకోవడంతో ఒత్తిడికి తట్టుకోలేక రిటెయినింగ్‌ వాల్‌ కూప్పకూలిం దన్నా రు. సాగర్‌లోకి భారీ స్థాయిలో వరద వస్తుందని ఊహించలే కపోయామని జలమండలి అధికారులు చెప్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నదన్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌లోకి వరద జులై నెలాఖరు నుంచి మొదలైందన్నారు. ఆగస్టు 1న సాగర్‌ నీటిమట్టం 530 అడుగులు మాత్రమే ఉందన్నారు. 590 అడుగుల నుంచి 450 అడుగుల వరకు నీటి మట్టాలు పడిపోయినా సొరంగ మార్గం ద్వారా సుంకిశాల పంపుహౌస్‌లోకి నీటిని తరలించే విధంగా డిజైన్‌ చేశారన్నారు. కానీ 530 అడుగుల మేర 169 టీఎంసీల నీటి ధాటినే రిటెయినింగ్‌ వాల్‌ తట్టుకోలేకపోవడం నిర్మాణంలోని లోపాలను ఎత్తి చూపుతున్నదని అన్నారు. వాస్తవానికి పంపుహౌస్‌లో మోటార్లు బిగించిన తర్వాత సొరంగం పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇక్కడ అధికారులు మోటార్లు బిగించకముందే మూడు సొరంగ మార్గాల్లో మూడో మార్గాన్ని ఓపెన్‌ చేసి పెట్టారని చెప్పారు. రిటెయినింగ్‌ వాల్‌, గేట్ల నిర్మాణం పూర్తి కావడం, సొరంగ మార్గాన్ని తెరిచే ఉంచడంతో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. సాగర్‌లో 530 అడుగులకు నీరు చేరగానే సొరంగం గుండా పంపుహౌస్‌లోకి నీరు ప్రవేశించే క్రమంలో ఒత్తిడికి గురై, రిటెయినింగ్‌ వాల్‌ కూలిపోయింని తెలిపారు. వాటర్‌ లీక్‌ అవుతున్నట్టు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదనే ప్రచారం జరిగిందన్నారు.
సైడ్‌ వాల్‌ ఘటన దురదృష్టకరం: గుత్తా
సుంకిశాల ప్రాజెక్టు సైడ్‌ వాల్‌ కూలిపోవడం దురదృష్టకరమని శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజ్‌కి వెళ్లిన సమయంలో, అలాగే వర్షాభావ పరిస్థితులు, వేసవిలో సైతం ఎలాంటి ఇబ్బందీ లేకుండా హైదరాబాద్‌ మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసేందుకు 2021లో గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. 2014 నుంచి 2022 వరకు సుంకిశాల ప్రాజెక్టు పనులు జరగలేదని, 2022 డిసెంబర్‌ వరకు ఈ ప్రాజెక్టుపై 875 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వివరించారు. సాగర్‌లోకి వచ్చిన భారీ వరద ఒత్తిడి వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ నారాయణ రెడ్డి, ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌, డీపీఆర్‌ఓ వెంకిటేశ్వర్‌ రావు, సాగర్‌ డ్యామ్‌ స్‌ఈ వెంకటేశ్వర్లు, మెట్రో వాటర్‌ ఎస్‌ఈ సుదర్శన్‌, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మెన్‌ కర్నాటి లింగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్‌ నాయక్‌, ఇరిగేషన్‌ అధికారులు ఉన్నారు.

Spread the love