నవతెలంగాణ – జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అయిజ రోడ్డులో ఏర్పటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు.. 12 మండలాలు.. నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఇది వరకు ఇక్కడకు రాలేదు.. తొలిసారి వచ్చిన కాబట్టి.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రూ. 10 లక్షల చొప్పున ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేస్తున్నాం. దాంతో బాగా చేసుకోవాలని కోరుతున్నాను. మండల కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ప్రతి మండల కేంద్రానికి రూ. 15 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాను. గద్వాల మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు, మిగిలిన మూడు మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాను. ఈ నిధులతో మున్సిపాలిటీలు బాగుపడాలి. అద్భుతమైన పనులు జరగాలి. ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వాటన్నింటిని మనం సాధించుకుందాం. గట్టు ఎత్తిపోతల పథకాన్ని, అలంపూర్‌లో ఆర్డీఎస్‌కు కొనసాగింపుగా ఉన్న మల్లమ్మ కుంట పథకాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామన్నారు.