కేసీఆర్‌ సారోస్తారా.!

– గజ్వేల్‌ క్యాంపు కార్యాలయానికి వస్తారని ప్రచారం
నవతెలంగాణ-గజ్వేల్‌
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి త్వరలో వస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఉదయం ప్రధాన ఛానెళ్లలో గజ్వేల్‌లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ పూర్తిగా శుభ్రం చేసి అందులో ఉన్న ఫర్నిచర్‌ ఇతర సామగ్రి తదితర వాటిని ఉంచాలని ఆదేశించినట్లు సోషల్‌ మీడియాలో ప్రధాన ఛానల్లో ప్రసారమయ్యేది. దీంతో గజ్వేల్‌ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సంతోషాలకు అవధులు లేవు. కెసిఆర్‌ సారొస్తారట అంటూ సోషల్‌ మీడియా మొత్తం వైరల్‌ చేశారు. గజ్వేల్‌ లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఉన్న వసతులు భద్రత కు కావలసిన అన్ని ఏర్పాట్లు గజ్వేల్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం కూడా భద్రతపరంగా లేదని చెప్పాలి. బుల్లెట్‌ ప్రూఫ్‌ తో ఈ క్యాంప్‌ కార్యాలయం 33 సీసీ కెమెరాలు దాదాపు ఎక్కడ చూసిన కిలోమీటర్‌ వరకు దీర్ఘ దష్టి క్యాంప్‌ కార్యాలయం నుండి చూడవచ్చు. సకల ఏర్పాట్లతో పూర్తిచేసిన ఈ క్యాంప్‌ కార్యాలయానికి నిర్మాణం నుండి ఒకే ఒకసారి నిర్మాణం చివరి దశలో ఉండగా కేసీఆర్‌ అందులోకి అడుగుపెట్టి పరిశీలించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఒక్కసారి కూడా క్యాంప్‌ కార్యాలయానికి రాలేకపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయింది. గజ్వేల్‌ లో ఎమ్మెల్యే స్థానం మాత్రమే కేసీఆర్‌ దక్కించుకోగలిగారు. ఎన్నికల ముందు ప్రతినెల కార్యకర్తలతో అందుబాటులో ఉండాలని కెసిఆర్‌ మాట ఇవ్వడంతో అప్పట్లో కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు సంబూర పడ్డారు. అదే మాటతో కేసీఆర్ను భారీ మెజార్టీతో గజ్వేల్‌ లో గెలిపించినప్పటికీ రాష్ట్రంలో అధికారం పోయింది. ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి పడడంతో ప్రస్తుతం హైదరాబాదులోని నంది నగర్‌ లో నివాసముంటున్న కేసీఆర్‌ ఆరోగ్యంగా కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇటీవల మాజీ మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌ ప్రకటించారు. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల రానున్న నేపథ్యంలో గజ్వేల్‌ క్యాంపు కార్యాలయంలో ఉండి ఇక్కడనుండే రాష్ట్ర రాజకీయాలను నడపాలని ఉద్దేశంతో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్‌ సార్‌ వస్తారని అందరూ భావిస్తున్నారు. క్యాంప్‌ ఆఫీసు సిద్ధం చేయాలని పార్టీ క్యాడర్‌ కు ఇక్కడున్న నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 19న మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గం క్యాడర్‌ సమావేశం ఉన్నందున గజ్వేల్‌ నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సమాచారం పంపినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో గజ్వేల్‌ పర్యటన పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని స్థానిక నాయకులు అంటున్నారు.

Spread the love