– అప్పుడే నల్లగొండకు రావాలి
– బీఆర్‌ఎస్ సభను అడ్డుకుంటాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కేసీఆర్.. ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు నల్లగొండకు వస్తున్నారు.. క్షమాపణ చెప్పాకే రావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, ఈనెల 13న నిర్వహించే బీఆర్‌ఎస్ సభను అడ్డుకుంటామని, కెేసీఆర్ దిష్టిబొమ్మలతో నిరసన తెలుపుతామని అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో కుమ్మక్కై రాష్ట్రం నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
బడ్జెట్ గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావుకు లేదన్నారు. బీఆర్‌ఎస్ నిర్వాకంతో బడ్జెట్లో 13 శాతం మేర రూ.13 వేల కోట్లు అప్పులకే పోతున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాయోగ్యమైందని, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో అన్ని రంగాలకు సమప్రాధాన్యతన ఇచ్చామని చెప్పారు. సభలో నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ ప్రసంగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాట తప్పడంపై సభ రోజు వినూత్న నిరసన చేపడతామని, కేసీఆర్ కోసం కుర్చీ, పింక్ టవల్, ఎల్‌ఈడీ స్క్రీన్‌ను పోలీసుల అనుమతితో పెడతామన్నారు. కేఆర్‌ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టిందే కేసీఆర్, హరీశ్‌రావు అని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలని కోరారు.