ఎవ‌రు గెలిస్తే మంచిదో నిర్ణ‌యించి ఓటేయాలి: కేసీఆర్

నవతెలంగాణ – కాగ‌జ్‌న‌గ‌ర్ : ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు ఆగ‌మాగం కాకుండా.. ఎవ‌రు గెలిస్తే మంచిదో నిర్ణ‌యించి ఓటేయాలి.. ఆషామాషీగా, అల‌వోక‌గా ఓటు వేయొద్ద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూచించారు. సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. మ‌న దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు అయింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ రావాల్సిన ప‌రిణితి రాలేదు. ఏ దేశాల్లో అయితే ప్ర‌జాస్వామ్యంలో ప‌రిణితి వ‌చ్చిందో ఆ దేశాలు చాలా బాగా ముందుకు పోతున్నాయి. మ‌న దేశంలో ఇంకా ఆ ప‌రిస్థితి లేదు. రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఎల‌క్ష‌న్లు చాలా వ‌స్తాయి పోతాయి. ఎన్నిక‌ల్లో ఎవ‌రో ఒక‌రు గెలుస్త‌రు అంద‌రికీ తెల‌సు. మీరు చాలా సార్లు ఓట్లేశారు. ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చాయి. ప్ర‌తి పార్టీ త‌ర‌పున ఒక‌రు నిల‌బడుతారు. కోన‌ప్ప‌ బీఆర్ఎస్ త‌ర‌పు ఉన్నారు. 30న ఓట్లు ప‌డుతాయి. 3న లెక్కింపు అయిపోత‌ది. ఫ‌లితం తేలుతుంద‌న్నారు కేసీఆర్. మీరు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఏందంటే అభ్య‌ర్థి గుణ‌గ‌ణాలు, సేవాత‌త్వం గురించి ఆలోచ‌న చేయాలి. ఆ అభ్య‌ర్థుల‌ వెనుకాల ఏ పార్టీ ఉంది. వాటి చ‌రిత్ర విధానాలు, ప్ర‌జలు, రైతుల గురించి ఏం ఆలోచిస్తుంది..? అధికారం వ‌స్తే ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో ఆలోచించాలి. ఎన్నిక‌లు అయిపోగానే ప్ర‌క్రియ ఆగిపోదు. ఇక్క‌డ గెలిచే ఎమ్మెల్యేతో రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంది. మీ ఓటు వ‌జ్రాయుధం, చాలా విలువ ఉంట‌ది. ఐదేండ్లు మీ త‌ల‌రాత‌ను రాస్త‌ది. భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యిస్త‌ది. అందుకే జాగ్ర‌త్త‌గా ఓటు వేయాలి.

Spread the love